మానవత్వం చాటుకున్న హోంమంత్రి సుచరిత

28 Aug, 2019 14:27 IST|Sakshi

రోడ్డుపై ఫిట్స్‌తో పడి ఉన్న యువకుడికి చికిత్స చేయించి బంధువుల వద్దకు చేర్చిన వైనం

గుంటూరు రూరల్‌: నడిరోడ్డుపై ఫిట్స్‌ వచ్చి పడిపోయిన ఓ యువకుడికి సత్వరం చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత. వివరాల్లోకి వెళ్తే విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి మంగళవారం గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో ఉండగా ఫిట్స్‌ వచ్చింది. ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని లారీడ్రైవర్‌ లారీ నుంచి దించి నడిరోడ్డుపై విడిచి వెళ్లాడు. 

అటుగా వెళ్తున్న వందల వాహనాలు రోడ్డుపక్కన ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని చూసి పట్టించుకోకుండా వెళ్తుండగా, అదే సమయంలో సెక్రటేరియట్‌ నుంచి గుంటూరుకు కాన్వాయ్‌తో వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆ యువకుడిని గమనించి కాన్వాయ్‌ నిలిపి ఆతనికి తాగునీరు అందించి, సిబ్బందితో సమీపంలోని వైద్యులను పిలిపించి ప్రథమచికిత్స చేయించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో ఆతని వివరాలు తెలుసుకుని ఫోన్‌ ద్వారా నెల్లూరులోని యువకుడి అక్కకు సమాచారం అందించారు. యువకుడు స్పృహలోకి వచ్చిన తరువాత ఆతనిని పోలీసుల సహాయంతో నెల్లూరుకు బస్‌లో పంపించారు. 

మరిన్ని వార్తలు