మేల్కొందాం

17 Nov, 2014 03:13 IST|Sakshi
మేల్కొందాం

అనంతపురం సిటీ : ‘రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 76 ఏళ్ల క్రితం రాజనీతిజ్ఞుల సమక్షంలో శ్రీభాగ్ ఒప్పందం జరిగింది. ప్రస్తుతం దాన్ని విస్మరిస్తున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నివిధాలా వెనుకబడిన రాయలసీమ గురించి పాలకులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు.  ఇకనైనా మేల్కొందాం. చరిత్రలో సాక్షిగా నిలిచిన శ్రీభాగ్ ఒప్పందం అమలు కోసం పోరాడదామ’ని వక్తలు పిలుపునిచ్చారు.

రాయలసీమ అభివృద్ధి సాధన సమితి జిల్లా నేత చవ్వా రాజశేఖరరెడ్డి అధ్యక్షతన ఆదివారం అనంతపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీమ అభివృద్ధిపై బహిరంగ చర్చావేదిక నిర్వహించారు. సీమ అభివృద్ధికి ఉన్న ప్రతిబంధకాలపై లోతుగా చర్చించారు. సీమవాసులు రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవులు అధిరోహించినా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అనంత చంద్రారెడ్డి, చింతకుంట మధు, విద్యాసాగర్‌రెడ్డి, రిలాక్స్ నాగరాజు, కసనూరు రఘునాథరెడ్డి, రొద్దం ఆదినారాయణరెడ్డి, వెంకటరెడ్డి, మహబూబ్‌పీరా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, ఎస్టీయూ నాయకులు రామన్న, శివమూర్తి, ఏపీటీఎఫ్‌హెచ్ నాయకులు కులశేఖర్‌రెడ్డి, అపాస్ శ్రీనివాసప్రసాద్, వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, లాయర్ రాంకుమార్, విద్యార్థి నాయకులు సాకే నరేష్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఒప్పందానికి విఘాతం
 రాజధాని వేరే ప్రాంతంలో ఏర్పాటుచేస్తే సీమలో హైకోర్టు నెలకొల్పాలని శ్రీభాగ్ ఒప్పందంలో ఉంది. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలి. ప్రస్తుతం అభివృద్ధి చెందిన విజయవాడ ప్రాంతంలో పచ్చని పంట పొలాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీభాగ్  ఒప్పందానికి విఘాతం కలిగేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. సీమ అభివృద్ధి కోసం మరో పోరాటానికి నాంది పలకాల్సిన సమయం ఆసన్నమైంది.
 -  చవ్వా రాజశేఖరరెడ్డి, రాయలసీమ అభివృద్ధి సాధన సమితి జిల్లా నేత
 
 మెరుగైన జీవన విధానం కోసం ఉద్యమించాలి
 సీఎం చంద్రబాబుకు ఈ ప్రాంత అభివృద్ధి పట్టడం లేదు. ఏడాదికి మూడు పంటలు పండే చోట రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయం లేదు. బ్రాందీషాపులు, సెల్‌ఫోన్‌లు తప్ప ఏమీ కన్పించడం లేదు. మెరుగైన జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకునేలా సీమవాసులు ఉద్యమించాలి.
 - ఇమామ్, కదలిక సంపాదకుడు
 
 ప్రశ్నించకపోవడంతోనే వెనుకబాటు
 సమైక్యాంధ్ర ఉద్యమం అనంతపురం జిల్లాలోనే ఉవ్వెత్తున ఎగిసింది. రాయలసీమ ఉద్యమానికి  మాత్రం ఎందుకు ముందుకు రావటం లేదు?! మన  నాయకులు ప్రశ్నించకపోవడంతోనే సీమ వెనుకబాటుకు గురైంది. త్వరలో ఉద్యమ కార్యాచరణ కోసం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తాం.
  - శరత్‌చంద్రారెడ్డి, రైతు సంఘం నేత
 
 భావితరాల కోసం ఉద్యమించాలి

 సీమ వెనుకబాటు తనంపై శ్రీకృష్ణకమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం పట్టించుకోలేదు. మన కోసం కాకపోయినా భావితరాల కోసం రాయలసీమ ఉద్యమానికి సిద్ధమవుదాం. శ్రీభాగ్ ఒడంబడిక అమలు కోసం పోరాడదాం.
 - నబీరసూల్,  వినియోగదారుల సంఘం జిల్లా కార్యదర్శి
 
 ఉద్యోగుల మద్దతు  సంపూర్ణంగా ఉంటుంది
 హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరముంది. రాయలసీమ అభివృద్ధి కోరుతూ చేపట్టే ఉద్యమాలకు ఉద్యోగుల తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటాం.
  -  దేవరాజు, ఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు
 
 అభివృద్ధికి నోచుకోలేదు
 ఈ ప్రాంతం నుంచి రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంతో మంది మేధావులు ఉన్నారు. అయినా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. అభివృద్ధి సాధనకు ఉద్యమాలు చేపట్టాల్సి ఉంది.           - అంజి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు


 ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
 సీమ వెనుకబాటుతనాన్ని గుర్తించి ఈ ప్రాంత నాయకులు ఇకనైనా మేల్కోవాలి. భావితరాలు మరింత నష్టపోకుండా చొరవ చూపించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కృషి చేయాలి.   
 - ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ముఖ్య అధికారప్రతినిధి

మరిన్ని వార్తలు