మృతుల పేరుతో పింఛన్‌ స్వాహా చేసిన జన్మభూమి కమిటీలు

22 Oct, 2019 08:33 IST|Sakshi

జన్మభూమి కమిటీ సభ్యుల బాగోతం  

56 మంది మృతుల పేరుతో రూ.14.20 లక్షలు స్వాహా 

సోషల్‌ ఆడిట్‌తో వెలుగు చూస్తున్న అక్రమాలు  

ఇప్పటికి ఎనిమిది మందిని సస్పెండ్‌ చేసిన కమిషనర్‌  

అధికారం ఉన్న ఐదేళ్లూ సంపాదన కోసం అడ్డమైన గడ్డీ తిన్న టీడీపీ నేతలు ఆఖరుకు మృతులను వదల్లేదు. దాదాపు 59 మంది మృతుల పేరుతో రూ.14.20 లక్షలు స్వాహా చేసినట్లు వెలుగుచూసింది. ఇందులో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యుల ఘనకార్యమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలకు సహకరించిన ఎనిమిది మందిపై కమిషనర్‌ వేటు వేశారు. 

సాక్షి, అనంతపురం న్యూసిటీ: టీడీపీ ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ ఛోటా నాయకులు అందినకాడికి దోచుకున్నారు. సంపాదనే పరమావధిగా అధికారులనూ పక్కదారి పట్టించారు. చివరకు మరణించిన వారి పేరుతోనూ పింఛన్లు తీసుకుని రూ.లక్షలు స్వాహా చేశారు.
 
ఎమ్మెల్యే ‘అనంత’ చొరవతో ...  
ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నగరంలోని అక్రమ పింఛన్లు తొలగించి అర్హులకు పింఛన్లు అందించాలని కమిషనర్‌ పి. ప్రశాంతిని కోరారు. దీంతో ఆమె ఈ నెల 18 నుంచి 21 వరకు 9 మంది కూడిన సోషల్‌ ఆడిట్‌ బృందం సభ్యులు నగరంలోని 18 డివిజన్లలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. వారు 638 మంది పింఛన్లను (పీడీఓ అథెంటికేషన్‌) తనిఖీ చేయగా అందులో 273 పింఛన్‌దారుల ఆధార్, రేషన్‌కార్డు తదితర వివరాలు సరిగా నమోదు కాలేదు. ఈ క్రమంలోనే మృతి చెందిన 56 మంది పేరున పింఛన్లు డ్రా చేస్తున్నట్లు తేల్చారు. ఇలా మృతి చెందిన వారు పేరుతో టీడీపీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు రూ.14,20,800 స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. 

ఎనిమిది మందిపై వేటు ... 
అక్రమ పింఛన్‌ల బాగోతంపై ఇప్పటికే కమిషనర్‌ ప్రశాంతికి కొన్ని ఫిర్యాదులందాయి. వాటిపై విచారణ జరిపిన కమిషనర్‌ అక్రమాలు నిజమని తేలడంతో ఎనిమిదిమంది నగరపాలక సంస్థ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. తాజాగా సోషల్‌ ఆడిట్‌లో 56 మంది మృతుల పేరుతో పింఛన్‌లు తీసుకున్నట్లు స్పష్టంగా తెలిసింది. ఈ అక్రమ పింఛన్లలో టీడీపీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అప్పటి ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్‌ స్వరూపలకు తెలిసే ఈ అక్రమ బాగోతం జరిగిందని నగరపాలక సంస్థ అధికారులు వాపోతున్నారు. దీంతో అక్రమ బాగోతానికి సహకరించిన వారిపైనా వేటుపడే అవకాశం ఉంది. ఇప్పటికి కేవలం 18 డివిజన్‌లలోనే సోషల్‌ ఆడిట్‌ జరగ్గా...మిగతా డివిజన్‌లలోనూ ఆడిట్‌ జరిగితే భారీగా అక్రమ పింఛన్‌లు తేలే అవకాశం ఉందని, అదే జరిగితే ఇంకా ఎంతమందిపై వేటు పడుతుందోనని అధికారుల్లో వణుకు పుడుతోంది.   

రికవరీ చేస్తాం 
బీకేఎస్‌ సోషల్‌ ఆడిట్‌ టీం ద్వారా సర్వే చేసేలా చర్యలు తీసుకున్నాం. 56 మంది మృతుల పేరుతో పింఛన్‌ సొమ్మును అక్రమంగా డ్రా చేశారు. పీడీఓల నుంచి డ్రా చేసిన మొత్తాన్ని రికవరీ చేయిస్తాం. దీంతో పాటుగా క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తా. ఇంకా రెండ్రోజుల పాటు ఆడిట్‌ జరుగుతుంది. అన్ని డివిజన్లలో సోషల్‌ ఆడిట్‌ చేసి అక్రమ పింఛన్లుంటే వెలికితీస్తాం. 
– పి. ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్‌  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా