మగ మహా భయస్తులు

17 Mar, 2018 12:58 IST|Sakshi

భార్యలకేనా..ఆ బాధ్యత భర్తలకు లేదా!

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలకు ముందుకు రాని భర్తలు

ఎవరైతేనేం..శస్త్ర చికిత్సలే వైద్య శాఖ లక్ష్యం

మగ మహా రాజులుగా మీసాలు మెలేస్తారుమగ ధీరులుమంటూ మాటలు కోటలు దాటిస్తారుధైర్యానికి ప్రతీకలుగా కండలు తిప్పుతారువాస్తవానికి ఇవన్నీ మహిళలకే వర్తిస్తాయి...
ఓ యువతా... ఇల్లరికం వస్తావా అంటేకొత్తవాళ్ల మధ్య నే మసలలేననే సమాధానం...
ఓ మొగుడా గర్భం దాల్చి బిడ్డను కంటావా అంటేఆ భారం మోయలేను..ఆ బాధ భరించలేనంటావ్‌
పసి బిడ్డను లాలించగలవా అని ప్రశ్నిస్తే...పసికందు ఏడుపును నేనెలా ఆపగలనంటావ్‌
కనీసం కు.ని. శస్త్ర చికిత్స చేయి ంచుకో అంటేయోజనాల దూరం పరుగులు తీస్తావ్‌...
మాకు తెలుసులే..మీదంతా మేకపోతు గాంభీ ర్యమేమీరంతా మగ మహా భయస్తులనేది నిజంలే...

తూర్పుగోదావరి, కొత్తపేట: ఒక బిడ్డ ముద్దు..ఇద్దరు బిడ్డలు హద్దు..మూడో బిడ్డ వద్దు..అన్నది వైద్య ఆరోగ్య శాఖ నినాదం. ఆ దిశగానే ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. చేయించుకున్నవారికీ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దాదాపు అందరూ ఒకరు, ఇద్దరితోనే సరిపెట్టుకుని స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే సంతానానికి భార్యా, భర్త ఇద్దరూ కారకులైనా..కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు మాత్రం భర్తలు ఆమడ దూరంలో ఉంటున్నారు.   పురుషులకే వేసక్టమీ ఆపరేషన్లు చేయాలని లక్ష్యాలను నిర్దేశిస్తున్నా.. ఆ లక్ష్య సాధనకు అధికారులు కృషి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కేవలం స్త్రీలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ల సంఖ్యనే చూపించి లక్ష్యాలు సాధించినట్టు చంకలు గుద్దుకుంటున్నారు.

వేసక్టమీ ఆపరేషన్‌ సులువైనా...
పురుషులకు కోత, కుట్టు, కట్టు లేని అతి సులువైన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స అందుబాటులో ఉన్నా ముందుకు రావడం లేదు. ఎక్కడో అతి కొద్దిమంది మాత్రమే వేసక్టమీ చేయించుకుంటున్నారు. అదీ పట్టణ ప్రాంతాల్లోనే. గ్రామీణ ప్రాంతాల్లో మచ్చుకు కూడా ఆ జాడ కనిపించడం లేదు. మహిళలకు చేసే ట్యూబెక్టమీ కంటే పురుషులకు చేసే వేసక్టమీ ఆపరేషన్లకే ప్రభుత్వం ఎక్కువ పారితోషికం చెల్లిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు రూ. 660 చెల్లిస్తుండగా పురుషులకు రూ.1,100 ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సహజ ప్రసవమయ్యేలా ప్రయత్నిస్తూ... అత్యవసరమైతేనే సిజేరియన్‌ చేస్తున్నారు. అనేక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం సహజ ప్రసవంమయ్యే అవకాశం ఉన్నా పెద్ద మొత్తంలో బిల్లులు దండుకునేందుకు సిజేరియన్‌ చేస్తుండగా, కొందరు నొప్పులు బాధ నుంచి తప్పించుకొనేందుకు స్వచ్ఛందంగా సిజేరియన్‌ ద్వారా బిడ్డకు కంటున్నారు.

అపోహలు కారణం...
వేసక్టమీ శస్త్ర చికిత్సలు ఎక్కువగా జరగకపోవడానికి పురుషుల్లో పలు అపోహలే కారణం. పురుషులు వేసక్టమీ చేయించుకుంటే లైంగిక సామర్ధ్యం, బలం, కోరిక తగ్గుతుందని పురుషులు భావించడం ఒక ప్రధాన కారణం. వాస్తవానికి పురుషులకు కత్తిరింపుతో కాకుండా చిన్న రంధ్రం ద్వారా వేసక్టమీ చేస్తాం... కొంత సేపు అనంతరం ఇంటికి వెళ్లిపోవచ్చు.

ట్యూబెక్టమీ కన్నా వేసక్టమీ సులువైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌. ట్యూబెక్టమీతో మహిళ చర్మం 6 పొరలు కోయాలి. 7 నుంచి 10 రోజులు ఆస్పత్రిలో ఉండాలి. అదే వేసక్టమీ అయితే పురుషులకు చిన్నగాటు పెట్టి కుట్టు కూడా లేకుండా ఆపరేషన్‌ చేస్తారు. వెంటనే ఇంటికి వెళ్లిపోవచ్చు.– డాక్టర్‌ ప్రదీప్తి కరుణ, గైనకాలజిస్ట్, కొత్తపేట

>
మరిన్ని వార్తలు