దివ్యమైన సిరి

2 Apr, 2018 11:44 IST|Sakshi
ఎంబ్రాయిడరీ వర్క్‌లో శిక్షణ ఇస్తున్న దృశ్యం

మానసిక దివ్యాంగుల భవితకు బాట

విద్య, ఆర్థిక స్థిరత్వంపై ఉత్తమ శిక్షణ

నాన్న ఆర్థిక సాయం.. తాతయ్య స్థలసాయం..

దాతల వితరణలతో సేవలు విస్తృతం

విద్యార్థుల ప్రేమమూర్తిగా  గోపీదేవి

సామర్లకోట: జిల్లాలోని సామర్లకోటలో ఉన్న సిరి మానసిక దివ్యాంగుల కేంద్రం ప్రేమాలయంగా ఖ్యాతినార్జించింది. సుమారు 200 మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారు ఆర్థికంగా వృద్ధి చెందడానికి వృత్తి శిక్షణ ఇస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు నిర్వాహకులు. గోపీదేవి అనే సాధారణ మహిళ 1994లో పెద్దాపురం రోడ్డు బడేలమ్మ చెరువు ఎదురుగా మానసిక దివ్యాంగుల సేవా సంస్థ ‘సిరి’ని స్థాపించారు. అనేక మంది సూచనల మేరకు ఈ సంస్థ సేవలు విస్తృతం చేసే లక్ష్యంతో పెద్దాపురం మండలం ఆనూరులోనూ, ప్రత్తిపాడులోనూ శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద మహిళలకు ఉచితంగా విద్య, వసతి, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆ వెలుగుల్లో తానూ ప్రకాశిస్తూ తన జీవితానికి అర్థం పరమార్థం సేవలోనే అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు గోపీదేవి. ఆమె చేస్తున్న సేవలు గుర్తించి అనేక మంది తమ తమ పుట్టిన రోజు వేడుకలను ఈ కేంద్రంలో విద్యార్థుల మధ్య జరుపుకొంటున్నారు.

నిరుపేద మానసిక వికలాంగులకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నదీ ఆమె మాటల్లోనే..
‘ శ్రీకాకుళంలో బీఏ పట్టా తీసుకున్న అనంతరం మానసిక వికలాంగులకు సేవ చేయాలనే కోరికతో మెంటల్‌ రిటార్డేషన్‌లో డిప్లమో చేశాను. నా ఉత్సాహం గమనించిన మా నాన్న దాశెట్టి సూర్య కుమార్‌ ఇచ్చిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో మా తాతయ్య అప్పలరాజు స్వస్థలమైన సామర్లకోటలో మానసిక దివ్యాంగుల సేవాసంస్థ ‘సిరి’ని స్థాపించాను. మానసిక దివ్వాంగులకు ప్రేమ, ఆదరణతోపాటు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో చెన్నైలో ఉండే తల్లిదండ్రుల ఆర్థిక సహాయంతో, ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. 2000 సంవత్సరంలో తమ సంస్థ ‘సిరి’కి ప్రభుత్వ గుర్తింపు లభించింది. దీంతో మరింత ఉత్సాహంతో మతిస్థిమితం లేని బాలబాలికలకు ఉచిత విద్య, భోజనం, ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ, శారీ పెయింటింగ్, సర్ఫ్‌ తయారీ, రీడింగ్, రైటింగ్, ప్రవర్తన సర్దుబాటు, వృత్తి విద్యలలో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నాం.

సంస్థలో నిర్వహిస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సార్లు ‘బెస్ట్‌ సోషల్‌ వర్కర్‌’ పురస్కారాలను ప్రదానం చేసింది. కేవలం అవార్డుల కోసం కాకుండా మానసిక పరిపక్వతలేని 5–15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలకు పై విభాగాల్లో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన విద్యార్థులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తున్నాం. దాతల ద్వారా సేకరించిన విరాళాలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి ఆ మొత్తం మీద వచ్చే వడ్డీతో పిల్లలకు జీవితకాలం భోజన వసతి కల్పిస్తున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది విద్యార్థులు సిరి మానసిక సంస్థలో శిక్షణ పొందుతున్నారు. వీరికి 40మంది సుశిక్షితులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. 15 ఏళ్లు పైబడిన మతి స్థిమితం లేని మహిళలకు భవిష్యత్‌లో ఆసరాగా ఉండేందుకు షెల్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రేమకు, ఆప్యాయతలకు నోచుకోని నిరుపేద మానసిక వికలాంగులకు చేయూత ఇవ్వడం ద్వారా స్వయంగా ఆ భగవంతుడికే సేవ చేసినట్లు భావించి దాతలు సహృదయంతో స్పందించి ఆర్థికంగా మరింత సహకారం అందించాలని కోరుతున్నాను.’

మరిన్ని వార్తలు