మే'నరకం'

21 Nov, 2019 03:50 IST|Sakshi
రచ్చబండలో ఊరి పరిస్థితి వివరిస్తున్న గ్రామస్తులు

పెద్దల కట్టుబాట్లే చిన్నారులకు శాపాలు

వైఎస్సార్‌ జిల్లా మడూరులో ఇంటింటా కన్నీటిగాధలే.. 

తమ పిల్లల్ని బయటి వారికిచ్చి పెళ్లి చేయకూడదనే కట్టుబాటు 

మేనరికపు వివాహాలతో చిన్నారుల్లో బుద్ధిమాంద్యం, వైకల్యాలు

అవగాహన కల్పిస్తున్నా కట్టుబాటు వదలమంటున్న గ్రామస్తులు

వాళ్లు మద్యం ముట్టరు, మాంసం తినరు, ఎన్నో ఏళ్లుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బయటి కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఈ కట్టుబాట్లు పాటిస్తారో లేదోనన్న భయంతో మేనరికపు పెళ్లిళ్లతో తమ పిల్లల జీవితాల్లో చీకట్లు నింపుతున్నారు. మేనరికపు పెళ్లిళ్లు పిల్లల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్నా.. వైఎస్సార్‌ కడప జిల్లా తొండూరు మండలం మడూరుకు చెందిన ‘సాతాను’ కులస్తులు మాత్రం కట్టుబాట్లను వీడడం లేదు. పిల్లల్లో బుద్ధిమాంద్యం, అంధత్వం, వైకల్యాలకు మేనరికపు వివాహాలే కారణమని వైద్య ఆరోగ్య శాఖ ఎంత అవగాహన కల్పించినా మార్పు శూన్యం. ఇటీవల చదువుకున్న యువత కులాంతర వివాహాలు చేసుకుంటూ మార్పు దిశగా పయనిస్తోంది. మడూరు గ్రామంలోని ‘సాతానుల’ బతుకు చిత్రంపై సాక్షి ప్రత్యేక కథనం.
–సాక్షి ప్రతినిధి, కడప

ఈ చిన్నారి పేరు ఐశ్వర్య, వయసు ఐదు సంవత్సరాలు. తన తోటి పిల్లలతో ఆడుకునే, బడికెళ్లే వయసు.. ముద్దులొలికించే ఐశ్వర్య పుట్టుకతోనే మంచానికి పరిమితమైంది. లేవలేదు, కూర్చోలేదు. ఎవరో ఒకరు పక్కనుండి అన్నీ చూసుకోవాల్సిందే. వైద్యం కోసం ఆస్పత్రులకు తిరిగినా చిన్న మార్పు కూడా లేదు. తల్లి శోభారాణి, తండ్రి నరేష్‌లది మేనరికపు పెళ్లి. మేనరికం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా.. ఎందుకు చేసుకున్నారని శోభారాణిని సాక్షి ప్రశ్నిస్తే.. ‘ ఆ సమయంలో నాకంత అవగాహన లేదు. తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఇలాంటి జీవితం ఎవరికీ రాకూడదు. మేనరికం పెళ్లిళ్లు ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలిసొచ్చింది. అయినా ఏం లాభం’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పల్లెలో ఏ ఇంటిని పలకరించినా ఇలాంటి కన్నీటి గాథలెన్నో మనసును చివుక్కుమనేలా చేస్తాయి. 22 ఏళ్ల వయసులో నిర్జీవంగా పడిఉన్న ప్రశాంత్, పుట్టుకతోనే చూపు కోల్పోయిన స్వర్ణలత, వరలక్ష్మి, వెంకటశేషయ్యలు.. బధిరులుగా బతుకీడుస్తున్న సంతోష్, కళ్యాణిలు.. అంగవైకల్యంతో బాధపడుతున్న బీటెక్‌ స్టూడెంట్‌ అరుణ్‌.. ఇలా ఎందరో...

ఎన్నో తరాలుగా కట్టుబాటు  
వైఎస్సార్‌ కడప జిల్లా తొండూరు మండలం మడూరు గ్రామంలో మొత్తం 200 గడపలు ఉంటాయి. జనాభా 1200 మందికి మించదు. అయితే ప్రతి ఇంట్లో శారీరక, మానసిన లోపాలతో పుట్టే పిల్లలు కన్పిస్తారు. మద్యం, మాంసం ముట్టకపోవడం తమ పూర్వీకుల నుంచి వస్తుందని సాతానులు చెబుతున్నారు. తరాలుగా వస్తున్న కట్టుబాటు తప్పితే కీడు జరుగుతుందని, వారి నమ్మకం. మాంసం తినే ఇతర సామాజిక వర్గాలవారు గ్రామంలోకి వచ్చినా వారిని మంచాలమీద కూర్చోనివ్వరు. బయటనుంచే మాట్లాడి పంపేస్తారు. తమ పిల్లలను ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్న తమ కులస్తులకు కూడా ఇచ్చేందుకు అంగీకరించరు. దీంతో ప్రతి ఇంట్లో మేనరికపు వివాహాలే. 200 కుటుంబాల్లో 90 శాతం ఇదే గ్రామంలోనే వివాహం చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.  

ఇది పూడ్చలేని నష్టం...
తాము చేస్తున్న పనివల్ల పిల్లల భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని తెలిసినా.. వారిలో మార్పు లేదు. పిల్లల ఆరోగ్యం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగి ఆర్థికంగా చితికిపోయారు. కొందరు మేనరికం పెళ్లిళ్లు చేసుకోకపోయినా వారి పిల్లలకు అంగవైకల్యం వచ్చిందని.. మేనరికం కొంత కారణమైనా.. పూర్తిగా అదే కాదనేది మండూరు గ్రామస్తుల వాదన. మాజీ సర్పంచ్‌ ప్రకాశరావు మాట్లాడుతూ.. ‘ మా ఆచారం ఎవరికీ నష్టం కలిగించదు. ఇప్పటికీ మా గ్రామంలో ఏ ఇంటిలోనూ మాంసం వండరు. బయట మా సామాజిక వర్గం తక్కువగా ఉండడంతో అందరూ ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఈ మేనరికం వివాహాలవల్లే  వందలాది మంది భవిష్యత్తు నాశనమైంది. ఇది పూడ్చలేని నష్టం. ఇప్పుడు మేం ఎవరిపైనా ఆంక్షలు పెట్టడంలేదు. కులాంతర వివాహాలు అనుమతిస్తున్నాం. ఇప్పుడిప్పుడు చదువుకున్న పిల్లల్లో మార్పు వచ్చింది. కొన్ని కులాంతర వివాహాలు జరుగుతున్నాయి’ అని చెప్పుకొచ్చారు.  

మాటలు రాని సంతోష్‌తో అంధురాలైన తల్లి స్వర్ణలత  

అధికారులు, వైద్యసిబ్బంది ప్రయత్నాలు వృథా 
ఈ గ్రామస్తుల నమ్మకాన్ని మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రమౌళి, జాయింట్‌ కలెక్టర్‌ విజయలక్ష్మి లాంటి అధికారులు చైతన్య కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. మేనరికపు పెళ్లిళ్లు వద్దనే విషయాన్ని అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, జనవిజ్ఞాన వేదిక సభ్యులు పలుమార్లు వివరించారు. ఈ గ్రామంలో సుదీర్ఘ కాలంగా అవగాహన కల్పిస్తున్న హెల్త్‌ ఎడ్యుకేటర్‌ దేవిరెడ్డి రమణమ్మ పలు విషయాలు సాక్షితో పంచుకుంది. ‘అంగవైకల్యంతో పిల్లల జీవితాలు నాశనమవుతున్నా.. ఆచారానికే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఎంత అవగాహన కల్పించినా మడూరులో ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు’ అని చెప్పుకొచ్చింది.  
బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న ప్రశాంత్‌  

ఆ భయంతోనే మేనరికం
మా సాతాను కులపోళ్లు చాలా తక్కువగా ఉంటారు. బయట మా కులపోళ్లు అందుబాటులో ఉండకపోవడంతో ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తోంది. పైగా బయట ఉన్న వారు మాంసం, మద్యం ముట్టుకుంటారనే భయం. దీంతో మా పిల్లలకు ఈ గ్రామంలోనే పెళ్లిళ్లు చేస్తున్నాం. మేనరికం పెళ్లిళ్ల వల్లే అంగవైకల్యం, బుద్ధిమాంద్యం  అని డాక్టర్లు చెబుతున్నారు. దాంతో మావారిలోనూ మార్పు వస్తోంది 
–పి.రామానాయుడు, మడూరు 
 
మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం  
మడూరులో చాలా కుటుంబాల్లో మేనరికపు పెళ్లిళ్లే.. దీనివల్లే పిల్లల్లో అనారోగ్యమని చెబుతూనే ఉన్నాం. ప్రస్తుతం కొంతమార్పు వచ్చి ంది. నాలుగైదేళ్లుగా గ్రామస్తులు బయట వివాహాలు చేసుకుంటున్నారు. 
– ఎం.రాజేశ్వరి, ఆశా వర్కర్‌

ఇటీవలి కాలంలో యువతలో మార్పు 
నాలుగైదేళ్లుగా గ్రామంలో కొంత మార్పు చోటుచేసుకుంది. యువతరంలో వస్తున్న అవగాహన వల్ల చదువుకున్న యువత కులాంతర వివాహాలకు మొగ్గు చూపుతున్నారు. గ్రామానికి చెందిన  వెంకట నారాయణ, పల్లె ఎద్దుల కొండయ్య, పల్లె సూర్యనారాయణ, జి.రామానాయుడు, ఎ.రమేష్, పల్లె నవీన్, పల్లె శ్రేష్ఠ, ఎం.నాగలక్ష్మి తదితరులు ఉన్నత చదువులు చదివి డాక్టర్లయ్యారు. వీరు బయటి వారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. చదువుకున్న యువత కులాంతర వివాహాలు చేసుకోవడంతో మేనరికపు పెళ్లిళ్లు తగ్గాయని గ్రామస్తులు చెబుతున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా