లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఈవో

1 Oct, 2019 09:21 IST|Sakshi
ఏసీబీకి పట్టుబడిన ఎంఈఓ కోటేశ్వరరావు  

సాక్షి, ఉలవపాడు(ప్రకాశం) : చనిపోయిన టీచర్‌ కుటుంబానికి రావాల్సిన నగదుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎంఈవోను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఉలవపాడులోని మండల విద్యావనరుల కేంద్రంలో జరిగింది. బాధితుడు, ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఉలవపాడుకు చెందిన బడితల పద్మజ అదే మండలం అలగాయపాలెం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ 2017 అక్టోబర్‌ 16న అనారోగ్యంతో మరణించింది. ఆ తర్వాత ఏడాదికి ఆమె కుమారుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పరిస్థితుల్లో పద్మజ భర్త బడితల వెంకట రమణయ్య తన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కోసం మండల విద్యాశాఖాధికారి నాలి కోటేశ్వరరావును కలిశాడు. భార్య ఎర్నడ్‌లీవులకు సంబంధించి రూ.3 లక్షలు, కుమారుడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగ అర్హత లేని కారణంగా ఇచ్చే ఎక్స్‌గ్రేషియా రూ.8 లక్షల కోసం ఫైలు పెట్టి తనకు రావాల్సిన నగదు వచ్చేలా చూడాలని కోరారు.

డీఈఓను కలిసి అక్కడ నుంచి ఫైలు ఉలవపాడుకు వచ్చేలా చేశారు. ఈ ఏడాది సెస్టెంబరు 20న ఎంఈఓ కోటేశ్వరరావును కలిసి ఫైల్‌ పై సంతకం పెట్టాలని కోరగా అందుకు ఎంఈవో రూ.10 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఈనెల 27న ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం ఉలవపాడు మండల విద్యావనరుల కేంద్రంలో రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎంఈవోను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ గుంటూరు అడిషనల్‌ ఎస్పీ ఎç.Üసురేష్‌బాబు, సీఐలు ఎన్‌.రాఘవరావు, ఎ.వెంకటేశ్వర్లులు తన సిబ్బందితో దాడిలో పాల్గొన్నారు. నిందితుడిని అక్కడిక్కడే అరెస్టు చేసి, ఫైల్‌ సీజ్‌ చేశామని, అతడిని నెల్లూరు ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అడిషనల్‌ ఎస్పీ సురేష్‌బాబు తెలిపారు. 

మరిన్ని వార్తలు