ఉపాధ్యాయులను పీడిస్తున్న ఎంఈఓలు

4 Oct, 2019 09:50 IST|Sakshi

ప్రతి బిల్లులోనూ పర్సంటేజీ కోసం డిమాండ్‌

అడిగినంత సమర్పించుకుంటున్న టీచర్లు

ఆరోగ్యం బాగలేక ఎంప్లాయి హెల్త్‌ స్కీమ్‌ కింద ఉపాధ్యాయులు చికిత్స చేయించుకుంటే కొన్నింటికి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. మండల విద్యాశాఖాధికారి ఆ బిల్లులను శాంక్షన్‌ చేయించి సంబంధిత ఉపాధ్యాయులకు అందించాల్సి ఉంటుంది. బిల్లు చెల్లించే సమయంలో ఎంఈవోల నుంచి వినిపించే మాట ‘మాకేంటి?’
ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేసిన సమయంలో ఎరన్‌లీవ్, హాఫ్‌ డే లీవ్‌ వంటివి వస్తాయి. వాటికి సంబంధించిన బిల్లులన్నీ సంబంధిత మండల విద్యాశాఖాధికారి చేయాలి. ఉద్యోగ విరమణ సమయంలో ఉపాధ్యాయునికి పెద్ద మొత్తంలోనే వస్తుంటుంది. ఈ బిల్లు చేసిన తరువాత ఎంఈవోల నుంచి వినిపించే మాట ‘మాకేంటి?’
ప్రసవ సమయంలో టీచర్లు మెటర్నటీ లీవ్‌ పెట్టుకుంటారు. ఆరు నెలలు వారు ఇంటి వద్దే ఉంటూ పూర్తి జీతం తీసుకుంటారు. వీరికి ఎంఈవోలే ప్రతినెలా జీతం బిల్లు చేస్తుంటారు. ఆ సమయంలోనూ వినిపించే మాట ‘మాకేంటి?’ 
అవకాశం వచ్చినప్పుడల్లా ఎంఈవోలు ఉపాధ్యాయుల నుంచి డబ్బు ఎలా డిమాండ్‌ చేస్తున్నారో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కొన్నిచోట్ల రిక్వెస్ట్, మరి కొన్నిచోట్ల డిమాండ్‌ చేస్తూ పర్సంటేజీలు పుచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది.

సాక్షి, ఒంగోలు టౌన్‌: బిల్లులు చేసే విషయంలో మండల విద్యాశాఖాధికారులు విసిగిస్తున్నారని కొన్ని మండలాలకు చెందిన ఉపాధ్యాయులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి బిల్లు పెద్ద మొత్తంతో కూడుకొని ఉంటోంది. ఆ బిల్లులను సంబంధిత మండల విద్యాశాఖాధికారులు తమ విధుల్లో భాగంగా చేయాల్సి ఉంటుంది. అయితే ఆ బిల్లులు పెద్ద మొత్తంలో కనిపిస్తుండటంతో కొందరు అధికారులు వాటిపై కన్నేస్తున్నారు. తాజాగా ఉలవపాడు మండల విద్యాశాఖాధికారి ఇలాంటి బిల్లుల విషయంలో డబ్బులు డిమాండ్‌ చేసి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఉదంతంతో అలాంటి ప్రవృత్తి కలిగిన మండల విద్యాశాఖాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటివరకు దర్జాగా డిమాండ్‌ చేసి బిల్లుల్లో పర్సంటేజీలు వసూలు చేసినవారు కంగుతింటున్నారు. ఇంకొందరు మాత్రం మమ్మల్ని ఎవరు ఏమి చేస్తారంటూ పాత రోత ధోరణినే కొనసాగిస్తూ ఉపాధ్యాయుల బిల్లుల్లో చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

విసిగిస్తున్నారు.. 
ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌ కింద మెడికల్‌ బిల్లులు చేయాల్సి వస్తే కొంతమంది ఎంఈవోలు ఎగిరి గంతేస్తున్నారు. మెడికల్‌ బిల్లులకు సంబంధించి 50 వేల రూపాయల్లోపు అయితే మండల విద్యాశాఖాధికారి నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి, అక్కడ నుంచి రిమ్స్‌కు వెళ్లి అక్కడ అప్రూవల్‌ అయిన తర్వాత తిరిగి ఎంఈవో ద్వారానే సంబంధిత ఉపాధ్యాయునికి బిల్లు అందించడం జరుగుతోంది. రూ.50 వేలకు పైబడి వైద్యం చేయించుకుంటే ఆ బిల్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ అప్రూవల్‌ అయిన తర్వాత తిరిగి ఆ బిల్లును కూడా ఎంఈవో చేతుల మీదుగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు రకాల బిల్లుల విషయంలో తాము పర్సనల్‌గా చెప్పించడం వల్లనే ఈ బిల్లులు వచ్చాయని, అందుకు కొంతమందికి తాము శాంతి చేయాల్సి ఉన్నందున పర్సంటేజీలపై గట్టిగా పట్టుబటి వసూలు చేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.  జీతాలకు సంబంధించిన బిల్లుల విషయంలో కొందరు తమను జలగల్లా పట్టి పీడిస్తున్నారని, అలాంటి వారి ఆట కట్టించాలని ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.

మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ ఉన్నా..
ప్రతి మండలంలో మండల రీసోర్స్‌ సెంటర్‌ ఉంది. ఇందులో మండల విద్యాశాఖాధికారి ఉంటారు. మండల రీసోర్స్‌ సెంటర్‌ నిర్వహణకు సంబంధించి ప్రతి ఏటా మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ విడుదల చేయడం జరుగుతోంది. ఏడాదికి 80 వేల రూపాయల చొప్పున మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ కింద ఇంతకుముందు వరకు రిలీజ్‌ చేస్తూ వచ్చారు. ఆ గ్రాంట్‌లో కొంత భాగం సంబంధిత ఎంఈవో మెయింటెనెన్స్‌కే సరిపోతోందన్నది బహిరంగ రహస్యమే. అది చాలదన్నట్లుగా తమకు రావలసిన బిల్లుల విషయంలో కూడా కొందరు ఎంఈవోలు మెయింటెయిన్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అదికాకుండా మండల రీసోర్స్‌ సెంటర్‌ డవలప్‌మెంటే పేరుతో పీఓపీ చేయించాలని, ఫ్లోరింగ్‌ వేయించాలని, కర్టన్స్‌ కొనుగోలు చేయాలంటూ కొంతమంది ఉపాధ్యాయుల నుంచి డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారు. అలాంటి మెయింటెనెన్స్‌ రాయుళ్ల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఉపాధ్యాయులు కోరుతుండటం గమనార్హం.

‘డబుల్‌’ పర్సంటేజీ..
జిల్లాలోని 56 మండలాలకు 56 మంది మండల విద్యాశాఖాధికారులు ఉండాలి. కానీ 17 మండలాలకు లేరు. పక్క మండలాల వారినే ఇన్‌ఛార్జిలుగా నియమించారు. బిల్లుల విషయంలో పర్సంటేజీలకు అలవాటుపడిన కొందరు ఇదే మాదిరిగా రెండు మండలాలను తమ కంట్రోల్‌ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఒక్కో మండలంలో 50 నుంచి 100 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు మండల విద్యాశాఖాధికారుల కంట్రోల్‌లో ఉంటాయి. ఆ మండలాల ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లుల విషయంలో తాము చెప్పిందే వేదం కావడంతో డబుల్‌ పర్సంటేజీలు పొందుతున్నారు. కొంతమంది మండల విద్యాశాఖాధికారుల పర్సంటేజీల బెడద పెరిగిపోవడంతో ఏసీబీ ద్వారా అలాంటి వారి ఆట కట్టించాలంటున్నారు ఉపాధ్యాయులు.

మరిన్ని వార్తలు