మర్చంట్ పవర్ ప్లాంట్లతో వినాశనం

13 Dec, 2014 02:22 IST|Sakshi

శ్రీకాకుళం అర్బన్:  మర్చంట్ థర్మల్ పవర్‌ప్లాంట్లను పెట్టి జిల్లాను సర్వనాశనం చేసేం దుకు ప్రభుత్వం చూస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీసభ్యుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని, అందులో ఒక్క యూనిట్ కరెంట్  జిల్లా ప్రజల ప్రయోజనం కోసం కేటాయించగలరా అని ప్రశ్నించారు. కేవలం వ్యాపార సంబంధమైన ప్రాజక్టులను జిల్లాలో పెట్టి ప్రజల జీవితాలను నాశనం చేసేందుకేనని దుయ్యబట్టారు.

జనానికి మేలు చేయని పవర్‌ప్లాంట్లకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు.  వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పెట్టే తొలిసంతకాల్లో ఒక సంతకం ప్రాజెక్టు రద్దుపైనే తమ అధినేత జగన్ పెట్టేవారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోంపేట, మందస ప్రాంతాల్లో పర్యటించినపుడు తాము అధికారంలోకి వస్తే సోంపేట, కాకరాపల్లి ప్రాంతాల్లోని పవర్‌ప్రాజెక్టులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని..ఇపుడు అధికారం చేపట్టాక వాటికి మద్దతు తెలపడం శోచనీయమన్నారు.

పవర్‌ప్లాంట్ల రద్దుకు టీడీపీ మహానాడులో తనతోనే తీర్మా నం చేయించారని, దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రతిపాదించిన విషయూన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పగలరా అని ప్రశ్నించారు.  చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏదీ లేదని ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపాధి కల్పించే మత్స్య, కొబ్బరి, జీడి, ఖనిజ నిక్షేపాల పరిశ్రమల స్థాపన కోసం కృషిచేయకుండా ప్రజల వినాశం కోరే ప్రాజక్టు లు తెస్తామనడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.

కొంతమంది బడా పారిశ్రామికవేత్తల కోసం, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం పొందూరులో మర్చంట్ థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మించడానికి యత్నిస్తే...వీపు విమానం మోత మోగక తప్పదని హెచ్చరించారు. ఇక్కడ ప్లాంట్ నెలకొల్పడానికి ప్రభుత్వం ముందుకు వస్తే ఏర్పడబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. థర్మల్ పవర్‌ప్లాంట్లపై అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌లో జరిగిన యూఎన్‌వో సమావేశంలో ఉద్గారాలు వెదజల్లే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదని తీర్మానం చేస్తూ సంతకం చేసినట్టు ఈ సందర్భగా చెప్పారు.

ఆమదాలవలసలో సుగర్‌ఫ్యాక్టరీ తెరిపిస్తామని చంద్రబాబు, కూన రవిలు చెప్పారని దీనిపై దృష్టి సారించాల న్నారు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.    పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళల రుణంపై కనీసం మాట్లాడడం లేదన్నారు.
 
టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలన విక్రాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమని, రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటుధరను ప్రభుత్వం కల్పించాలన్నారు. తుపానులో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, శిమ్మ రాజశేఖర్, మండవిల్లి రవి, మొదలవలస లీలామోహన్, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదర్, పాలిశెట్టి మధుబాబు, గొర్లె రాజగోపాల్ ఉన్నారు.

మరిన్ని వార్తలు