లోగ్రేడ్‌.. లో రేట్‌

29 Jun, 2020 10:45 IST|Sakshi
పొగాకు వేలం నిర్వహిస్తున్న అధికారులు

ఈ ఏడాది అత్యధిక ఉత్పత్తి లోగ్రేడ్‌ రకం పొగాకే  

వేలంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు

లోగ్రేడ్‌ ఉత్పత్తులకు దక్కని మద్దతు ధర  

లోగ్రేడ్‌ ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్న వైనం

ఆశలన్నీ మార్క్‌ఫెడ్‌పైనే...

కందుకూరు: అసలే ప్రకృతి వైపరీత్యాలతో పొగాకు నాణ్యత తగ్గింది. దానికి తోడు కరోనా వైరస్‌ పుణ్యమా అంటూ 50 రోజులకు పైగా వేలం నిలిచిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న నాణ్యత కాస్త వేలం విరామంతో మరికాస్త దిగజారింది. రంగు మారి బ్రైట్‌గ్రేడ్‌ రకం కూడా లోగ్రేడ్‌ రకంలోకి మారిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఏడాది రైతుల వద్ద లోగ్రేడ్‌ ఉత్పత్తులే అధికంగా ఉన్నాయి. కానీ వీటిని అమ్ముకోవాలంటే రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన లోగ్రేడ్‌ పొగాకు బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేయరు. ఒకవేళ కొనుగోలు చేసినా ధర రాదు. ఇదీ ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 91.78 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. దాంట్లో ఇప్పటి వరకు 31.5 మిలియన్‌ కిలోలు  మాత్రమే కొనుగోలు చేశారు.  

లోగ్రేడ్‌ రకం కొనుగోలు చేయని వ్యాపారులు:   
ఈ ఏడాది వేలం ప్రారంభంలోనే పొగాకు నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బ్రైట్‌గ్రేడ్‌ కేవలం 40 శాతం మాత్రమే వచ్చిందనేది బోర్డు అధికారుల అంచనా. డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పొగాకు నాణ్యత దెబ్బతిని క్యూరింగ్‌లో మీడియం, లోగ్రేడ్‌ రకం ఉత్పత్తులు అధికంగా వచ్చాయి. దాదాపు 50 శాతం వరకు లోగ్రేడ్‌ ఉత్పత్తులు వచ్చాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేలంలో లోగ్రేడ్‌ రకం ఉత్పత్తులకు సరైన ధర దక్కితేనే రైతులు నష్టాల నుంచి బయటపడగలరు. కానీ పొగాకు వేలంలో పరిస్థితి పూర్తి భిన్నంగా నడుస్తోంది. బ్రైట్‌గ్రేడ్‌ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారే తప్పా లోగ్రేడ్‌ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వేలం కేంద్రంలో రోజూ వందల సంఖ్యలో లోగ్రేడ్‌ బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి.

ఉదాహరణకు కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో శనివారం 784 బేళ్లను వేలానికి ఉంచితే 634 కొనుగోలు చేయగా 150 బేళ్లను తిరస్కరించారు. అలాగే రెండవ వేలం కేంద్రంలో 719 బేళ్లను గాను 609 కొనుగోలు చేయగా 110 బేళ్లను తిరస్కరించారు. ప్రతి రోజు ఇదే తీరుగా వందల సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీని వల్ల రైతులకు అదనపు భారంగా మారుతోంది. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం ఒకెత్తు అయితే తిరిగి తమ క్లస్టర్‌ వంతు వచ్చే వరకు వేచిచూడాల్సిన వస్తోంది. ఒక క్లస్టర్‌ వంతు తిరిగి వేలానికి రావాలంటే కనీసం నెల రోజులకుపైగానే పడుతోంది. ఇలా బేళ్లను ఇంటిలోనే ఉంచుకోవడం వల్ల ఆ ఉత్పత్తుల నాణ్యత మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ధర విషయం మరీ దారుణంగా ఉంది. లోగ్రేడ్‌ ఉత్పత్తుల విషయంలో సిండికేట్‌గా మారి న వ్యాపారులు గిరిగీసినట్లు ఒక రేటును దాటడం లేదు. కేవలం రూ.80 మాత్రమే చెల్లిస్తున్నారు. గత నెల రోజుల వేలం ప్రక్రియలో లోగ్రేడ్‌ రకం పొగాకుకు ఇదే ధర లభిస్తోంది. ఒక్క రూపాయి పెరగడం లేదు, తగ్గడం లేదు. అదీ లేకపోతే వేలంలో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీంతో ఈ ఏడాది అధికంగా ఉన్న లోగ్రేడ్‌ ఉత్పత్తులను అమ్ముకోవడం రైతులకు గగనంగా మారుతోంది. అమ్ముకున్నా వ్యాపారులు చెప్పిన రేటుకు ఇచ్చేయాల్సిందే.  

వేలం ఆలస్యంతో మరింత నష్టం:  
కరోనా వైరస్‌ లేకుంటే ఇప్పటికే వేలం ప్రక్రియ చివరి దశలో ఉండేది. కానీ ఈ ఏడాది ఇంకా మరో రెండు నెలలకు వేలం ముగిసినా ముగిసినట్టే. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఉత్పత్తులు ఇంకా మిగిలిన ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో 8.4 మిలియన్‌లు, రెండవ వేలం కేంద్రంలో 7.2 మిలియన్‌ల వరకు అధికారిక కొనుగోళ్లు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్‌ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేశారు. ఇవిపోను అనధికారిక ఉత్పత్తులు కూడా ఉంటాయి. అంటే ఇంకెంత సమయం పడుతుందో ఊహించవచ్చు. దీని వల్ల ఉత్పత్తుల రంగు మారి అంతిమంగా రైతులకు నష్టం చేకూరుతుంది. అసలే లోగ్రేడ్‌ కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఇష్టపడడం లేదు. ఈ పరిణామం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బ్రైట్‌ గ్రేడ్‌ రూ.200లకు కొనుగోలు చేస్తున్నా, లోగ్రేడ్‌ రూ.80లు దాటడం లేదు. దీంతో సరాసరి రేట్లు కూడా రూ.140లు మించి రావడం లేదు. 

ప్రత్యక్ష వేలంలోకి ప్రభుత్వం
గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు వేలంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 1వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ప్రధానంగా వ్యాపారులు కూటమిగా మారి ధరలు పెంచకపోవడం, లోగ్రేడ్‌ ఉత్పత్తులను తిరస్కరిస్తుండడంతో ప్రభుత్వం వేలంలోకి అడుగు పెడుతోంది. రేట్లు రాని ఉత్పత్తులను రైతులకు మద్దతు ధర వచ్చేలా వేలంలో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తుంది. అంటే లోగ్రేడ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంటుంది.

దీని వల్ల వ్యాపారులు కూడా కచ్చితంగా లోగ్రేడ్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బోర్డు పరిధిలో రిజిస్టర్‌ అయి వేలంలో పాల్గొనని వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో వేలంలో పాల్గొనే వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలా మొత్తం మీద ప్రభుత్వమే స్వయంగా పొగాకు వేలంలోకి రావడం వల్ల ధరలు పెరుతాయనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ వ్యాపారులు ధరలు పెంచేందుకు ముందుకు రాకపోయినా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. దీని వల్ల ఇక రైతులు నష్టపోయే అవకాశం లేకుండా ఉంటుంది. అన్ని రకాల ఉత్పత్తులను మద్దతు ధరలకు వేలం కేంద్రాల్లోనే నేరుగా అమ్ముకునే అవకాశం వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు