అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ పాదరస శివలింగం

8 Sep, 2019 12:57 IST|Sakshi

సాక్షి, రాయదుర్గం:(అనంతపురం): పాదరసం ఒక రసాయన మూలకము. దీనిని క్విక్‌ సిల్వర్‌ అని కూడా అంటారు. సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం ఇదే. అత్యంత విషతుల్యమైన ఈ లోహం తామరాకుపై నీటిబొట్టులా తేలియాడుతూ ఉంటుంది. అయితే ఈ ద్రవరూప లోహంతో ఘన పదార్థాలను సృష్టించడం అసాధ్యమని అంటారు. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మన పూర్వీకులకే దక్కింది.

ఆ శాస్త్రీయతనే అనుసరిస్తూ.. 1974లో రాయదుర్గంలోని శ్రీరాజవిద్యాశ్రమంలో అప్పటి పీఠాధిపతి జీవన్ముక్త స్వాములు, జడసిద్దేశ్వర సరస్వతీ స్వామీజీ అపురూపమైన పాదరస లింగాన్ని ప్రతిష్టించారు. దేశంలో మొట్టమొదటి పాదరస లింగం ఇదే. రసవాదుల్ని పిలిపించి రెండు నెలలు అహర్నిశలు శ్రమించి, రుద్రమంత్ర జపాలతో ఏడు కిలోల పాదరసాన్ని మూలికాదులతో ఘనీభవింపజేసి లింగాకృతిగా మార్చారు. 14 సెంటీమీటర్ల ఎత్తు, 25 సెంటీమీటర్ల చుట్టుకొలతతో చూడముచ్చటగా ఉన్న ఈ లింగాన్ని నల్లరాతితో చేసిన పాణిపట్టంపై ప్రతిష్టించారు.  

మరిన్ని వార్తలు