రాష్ట్రాన్ని అధోగతిపాలుజేస్త్తున్నారు

4 Jun, 2016 23:47 IST|Sakshi

విజయనగరం మున్సిపాలిటీ :లోటుబడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రెండేళ్లలో మరింత అధోగతి పాలుజేశారని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగునాగార్జున విమర్శించారు. శనివారం విజయనగరం వచ్చిన ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధులతో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
 
 ఎన్నికలకు ముందు ఆ తరువాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదని, పైగా నవ నిర్మాణ దీక్షపేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ అనుకోరు... పాపాలు చేసిన వారే దేవాలయాలకు వెళతారు... ఎక్కువ డబ్బులు హుండీలో వేస్తారు... మురికి వాడల్లో ఉన్న వారికి మురికి ఆలోచనలే వస్తాయంటూ బాధ్యత గల ముఖ్యమంత్రి చేస్తున్న వాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక సమతుల్యత దెబ్బతిన్నట్లుగా ఉందని వాఖ్యానించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు, చవాకులు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
 
 ఈ విషయంపై తరచూ నోటిదురుసుతో మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్యలకు ధైర్యముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు