సందేశాత్మక చిత్రాలకే ప్రాధాన్యం

26 Feb, 2018 14:09 IST|Sakshi
దర్శకుడు వీవీ వినాయక్‌

సినీ దర్శకుడు వీవీ వినాయక్‌

కొత్తపేట: సమాజాన్ని ప్రభావితం చేసే సందేశాత్మక చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. గాయత్రీ కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్స్‌ జనరల్‌ మేనేజర్‌ బొరుసు వెంకట ఉదయబాస్కర్‌ మేనల్లుడు పసుపులేటి సాయిహర్ష – రమ్య వివాహ రిసెప్షన్‌ సందర్భంగా ఆదివారం సాయంత్రం కొత్తపేట వచ్చిన వినాయక్‌ విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్షనిజం, రాజకీయ, ముఠాకక్షలు తదితర అంశాలతో పెడదారి పట్టిన సమాజాన్ని ప్రభావితం చేసి, సన్మార్గంలో నడిపించే కథాంశాలతో చిత్రాలు తీస్తూ వచ్చానని తెలిపారు. అదే ఒరవడి కొనసాగిస్తూ చిత్రాలు తీస్తానన్నారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్ఫూర్తితో దర్శకుడిని కావాలనే లక్ష్యంతో సినీ రం గానికి వచ్చి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించానన్నారు.

ఆయన వద్ద, దర్శకుడు సాగర్‌ వద్ద కృష్ణ హీరోగా ‘అమ్మదొంగా’ సినిమాకు పని చేశానన్నారు. తొలుత జూనియర్‌ ఎన్‌టీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఆది’ సినిమా తీశానన్నారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించగా 13 సూపర్‌హిట్‌ అయ్యాయన్నారు. ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదని, త్వరలో కథ ప్రారంభించాల్సి ఉందని చెప్పారు. ఆ కథకు హీరో ఎవరన్నది ఇంకా అనుకోలేదన్నారు. ‘‘నాకు లక్ష్యం అంటూ ఏమీ లేదని, డైరెక్టర్‌ కావాలని ఆశించాను. అయ్యాను. ఆశించిన దానికన్నా వెయ్యిరెట్లు సంతృప్తి చెందాను’’ అని వినాయక్‌ చెప్పారు.

శ్రీదేవి మృతి తీరని లోటు
ప్రముఖ నటి శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని వినాయక్‌ అన్నారు. ఆమె మరణించారన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకునిగా, టెక్నీషియన్‌గా ఆమెను అభిమానించేవాడినన్నారు. సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుల్లో శ్రీదేవి ఒకరన్నారు. 

మరిన్ని వార్తలు