కుంచెతో యువతకు సందేశం

11 Jan, 2015 01:07 IST|Sakshi
కుంచెతో యువతకు సందేశం

పెందుర్తి: ‘ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి. నిత్యం దాని గురించి కలలు కనాలి. దానిని చేరుకునేందుకు నిరంతరం శ్రమించాలి. అప్పుడు ఎలాంటి లక్ష్యమైనా నీ పాదాల చెంతకు చేరుతుంది. నీ స్పూర్తితో మరికొందరు నీ బాటలో నడవాలి’ యువతకు వివేకానందుడు ఇచ్చిన సందేశమిది. దీన్ని అక్షరాల పాటిస్తున్నారు యువ కార్టూనిస్ట్ బి.హరివెంకటరమణ. పెందుర్తి దరి పురుషోత్తపురంలో నివాసం ఉంటున్న హరి రాష్ట్ర, జాతీయ స్థాయిలో కార్టూనిస్ట్‌గా గుర్తింపును పొందారు.

అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 వేల కార్టూన్లు, మూడు యానిమేషన్ చిత్రాలు, ఐదు షార్ట్‌ఫిల్మ్‌లు, మూడు డాక్యుమెంటరీలు, నాలుగు పుస్తకాలు రచించారు. 2013లో వివేకానందుని జయంతి సందర్భంగా జాతీయ యూత్ అవార్డు సాధించారు. హరి తన కార్టూన్లతో యువతను మేలుకొల్పేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆధునిక పోకడలు, పెరిగిన సాంకేతికత, విదేశీ సంస్కృతిపై వ్యామోహం తదితర అంశాలపై తనదైన శైలిలో యువతకు సందేశాన్ని అందిస్తున్నారు.
 
వివేకానందుని వాక్కులే స్ఫూర్తి

 నేటి యువత టెక్నాలజీని, సోషల్ మీడియాను వేదిక చేసుకుని అద్భుతాలు చేస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా తమ ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు చాలా వరకు అవి ప్రేమ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ వాటికి సామాజిక అంశాలను జత చేసి చూపిస్తే కొంతవరకైనా సమాజంలో మార్పు వస్తుంది. ‘బీ బోల్డ్.. బీ స్ట్రాంగ్’ అన్న స్వామి వివేకానందుని మాటలే నాకు స్ఫూర్తి. కళారంగం ద్వారానే మన ఉద్దేశాన్ని అందరికీ సులభంగా చెప్పవచ్చు.                                 

- హరి
 
 
 

మరిన్ని వార్తలు