గంగాజలం కోసం పయనం

12 Jan, 2014 04:20 IST|Sakshi

ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజలకు కావాల్సిన గంగాజలం కోసం మెస్రం వంశీయులు శనివారం బయల్దేరారు. ముందుగా కేస్లాపూర్‌లోని దేవస్థానం ఉన్న ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు సమావేశమై గంగాజలం కోసం వెళ్లే రూట్‌ను ఎంపికచేశారు. అనంతరం కాలినడకన గంగాజలం కోసం బయల్దేరారు. శనివారం రాత్రి పిట్టబొంగరంలో బస చేయనున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. ఆదివారం తండ్రా, ఈ నెల 13న జామ్‌గామ్, 14న గౌరి, 15న గుమ్‌నూర్, 16న మొర్రిగూడ, 17న జన్నారం మండలం గోదావరి అస్తల మడుగు వద్దకు చేరుకుంటామని చెప్పారు. అక్కడ పూజలు నిర్వహించి గంగాజలం సేకరిస్తామన్నారు.

 తిరుగుపయనంలో 19న గౌరి, 26న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేస్తామని తెలిపారు. అదేరోజు సాయంత్రం కేస్లాపూర్‌లో ఉన్న వడమర(మర్రి చెట్టు)వద్దకు చేరుకుంటామని చెప్పారు. ఆ చెట్టు వద్ద మూడు రోజులపాటు బస చేశాక 30న ఆలయం సమీపంలోని గోవడ్‌కు చేరుకుంటామని, అదేరోజు రాత్రి నాగోబా ఆలయంలో మహా పూజలు చేసి జాతర ప్రారంభిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3న ప్రజాదర్బర్ నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు మెస్రం వెంకట్‌రావు, మెస్రం కోసు కటోడ, మెస్రం శేఖు, మెస్రం హనుమంత్‌రావ్, మెస్రం తుక్డోజీ, మెస్రం వంశం ఉద్యోగుల సంఘం సభ్యులు మెస్రం మనోహర్, మెస్రం దేవ్‌రావ్, మెస్రం జంగులు పాల్గొన్నారు.
 ఓఎస్డీ పూజలు..
 వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కేస్లాపూర్ నాగోబా ఆలయంలో శనివారం కరింనగర్ రేంజ్ ఓఎస్డీ పనసారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వెంట తెచ్చిన జాగిలాలతో నాగోబాకు మొక్కించారు. ఆలయ చరిత్రను మెస్రం వంశీయులకు అడిగి తెలుసుకున్నారు.
 ఆయన వెంట సీసీ పెద్దయ్య, ఇంద్రవెల్లి ఎస్సై హనోక్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు