‘మెట్‌ఫార్మిన్’తో గుండెపోటుకు చెక్!

18 Jan, 2015 20:19 IST|Sakshi
‘మెట్‌ఫార్మిన్’తో గుండెపోటుకు చెక్!
  • మధుమేహ మందుతో గుండెజబ్బులకు మేలు
  • గుర్తించిన ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీగిరిధర్
  • సాక్షి, హైదరాబాద్: మధుమేహం చికిత్స కోసం ఉపయోగించే మెట్‌ఫార్మిన్‌ను వాడటం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయా? అవుననే సమాధానం చెపుతున్నారు.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్త డాక్టర్ కోటంరాజు శ్రీగిరిధర్. కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేసే మెట్‌ఫార్మిన్ వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి, జీవితకాలాన్ని పెంచుతుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.

    అయితే ఐఐసీటీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు అపోలిపో ప్రోటీన్‌ను తొలగించిన ఎలుకలకు మెట్‌ఫార్మిన్‌ను అందించినప్పుడు ఈ మందుతో అదనపు ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు. మెట్‌ఫార్మిన్‌తో మాక్రోఫేజెస్‌ల మోతాదు గణనీయంగా తగ్గడంతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వుల (హెచ్‌డీఎల్) మోతాదు పెరుగుతుందని, అదేసమయంలో హానికారక కొవ్వుల (ఎల్‌డీఎల్) మోతాదు తగ్గుతుందని శ్రీగిరిధర్ ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.

    డయాబెటిస్ ద్వారా వచ్చే గుండె జబ్బును ఇది తగ్గిస్తుందని.. డయాబెటిస్ లేని వారికి వచ్చే గుండె జబ్బును కూడా తగ్గిస్తుందని డాక్టర్ శ్రీగిరిధర్ ‘సాక్షి’కి చెప్పారు.  వి.సతీశ్, కె.సంతోష్, కె.కోటేశ్వరరావు, డాక్టర్ జె.మహేశ్‌కుమార్, అవినాశ్‌రాజ్ తదితరులు పాల్గొన్న ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత అమెరికన్ జర్నల్ ‘డయాబిటీస్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

>
మరిన్ని వార్తలు