తొలి దశలో ‘మెట్రో’ లేనట్లే!

15 Dec, 2014 03:17 IST|Sakshi
తొలి దశలో ‘మెట్రో’ లేనట్లే!

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో మెట్రో రైలు(మాస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ సిస్టమ్) కూత వినిపించదా? తొలి దశలో విశాఖ, విజయవాడల్లోనే మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టనున్నారా? రెండో దశలో అంటే 2018 తర్వా తే తిరుపతికి మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆలోచన చేస్తారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి అధికారవర్గాలు. మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో తిరుపతిలో చేపట్టే అవకాశాలు లేవని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి.

రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతుందని గ్రహించిన సీఎం చంద్రబాబు.. సెప్టెంబర్ 4న శాసనసభలో జిల్లాపై వరాల వర్షం కురిపించారు. ఆ వరాలతో ప్రజల ఆగ్రహాగ్నిని చల్లార్చాలని భావించారు. ఆ హామీల్లో తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడం ఒకటి. కానీ.. ఆ హామీ ఇచ్చినప్పటి నుంచీ దాన్ని అటకెక్కించే దిశగా చంద్రబాబు పావులు కదుపుతూ వస్తున్నారు.

రాష్ట్రంలో చేపట్టే మెట్రోరైలు ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మాజీ ఎండీ శ్రీధరన్ అంగీకరించారు. వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి), విశాఖపట్నంలకు  మెట్రో రైలు ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ఆగస్టు 30న ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల్లో ఎక్కడా తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

వీజీటీఎం పరిధిలో మెట్రో రైలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సెస్టెంబర్ 20న విజయవాడ, మంగళగిరిలో పర్యటించారు. విజయవాడ, మంగళగిరి మధ్య మెట్రో రైలు ఏర్పాటుచేయాలని సూచిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత నెలలో విశాఖపట్నంలో పర్యటించిన శ్రీధరన్ బృందం తొలి దశలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాల్లో పర్యటించి.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
 
ఇదేంటి బాబూ!
మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) రూపొందించే బాధ్యతను డీఎమ్మార్సీకి అప్పగిస్తూ అక్టోబరు 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల్లో వీజీటీఎం, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు ఒక కిమీ డీపీఆర్ రూపొందించేందుకు కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.ఎనిమిది లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కానీ.. అదే ఉత్తర్వుల్లో తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడానికి వీలుగా డీపీఆర్ రూపొందించాలన్న అంశాన్ని ప్రస్తావించలేదు.

తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి.. ఫీజుబులిటీ రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 లక్షలను కన్సల్టెన్సీ ఫీజుగా ఇచ్చేందుకు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. మెట్రో రైలు ప్రాజెక్టులపై హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు.. ఆ ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం, వీజీటీఎం మెట్రో రైలు ప్రాజెక్టుల డీపీఆర్‌లను మార్చి 31, 2015లోగా పూర్తి చేసి, అందించాలని సీఎం కోరారు. వీజీటీఎం, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశ పనులను జూన్, 2015 నుంచి చేపట్టి, జూన్, 2018లోగా పూర్తిచేయాలని దిశానిర్దేశం చేశారు. కానీ.. తిరుపతి మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టడంపై చర్చించలేదు.
 
ఇప్పటికి లేనట్లే..
తిరుపతికి మెట్రో రైలును మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకున్నా.. తుడా అధికారులు ఆ ప్రాజెక్టుకు అవసరమైన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, ఆర్టీసీ బస్టాండు, పద్మావతి మహిళా యూనివర్సిటీ, శ్రీనివాసమంగాపురం, ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ జూ, అలిపిరి, కపిలతీర్థం, రేణిగుంట విమానాశ్రయం మధ్య తొలుత మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయాలని తుడా అధికారులు ప్రతిపాదించారు.

సుమారు 60 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మారాన్ని నిర్మించాల్సి వస్తుందని తుడా అధికారులు అంచనా వేశారు. ఈ నివేదికను డీఎమ్మార్సీ పరిశీలించి.. ఫీజుబులిటీ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఇప్పటిదాకా డీఎమ్మార్సీ బృందం తిరుపతిలో పర్యటించలేదు. విశాఖపట్నం, వీటీజీఎం మెట్రో రైలు ప్రాజెక్టుల డీపీఆర్ రూపకల్పనలో డీఎమ్మార్సీ బృందం నిమగ్నమైతే.. తిరుపతిలో ఇప్పట్లో పర్యటించే అవకాశం లేదని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. వీటీజీఎం, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులు తొలి దశ పూర్తయిన తర్వాత.. తిరుపతి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందని తుడా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.

మరిన్ని వార్తలు