కోరిక తీర్చలేదని.. కక్షగట్టారు!

25 Oct, 2017 08:59 IST|Sakshi

 నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి తొలగించారు

లొంగకపోతే ఉద్యోగం చేయనివ్వరా..

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్‌ ఆవేదన

‘సాక్షి’ని ఆశ్రయించిన బాధితురాలు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆమెకు తల్లిదండ్రుల్లేరు.. పేదరికం కారణంగా వివాహమూ కాలేదు.. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.. అయినా ఆ నిరుపేదరాలిపై కక్షగట్టారు. నాలుగు మెతుకులు పెడుతున్న ఆ చిన్న ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. ఆమె చేసిన తప్పల్లా.. పై అధికారి కోరిక తీర్చకపోవడమే. దీంతో ఉపాధి కోల్పోయి వీధినపడ్డ ఆ అభాగ్యురాలు తనకు న్యాయం చేయాలంటూ ‘సాక్షి’ని ఆశ్రయించింది.  

ఉద్యోగమే ఆధారం: విజయనగరం జిల్లా జామి మండలం, లొట్లపల్లి గ్రామానికి చెందిన ఆమె పేరు జన్నెల వాణిశ్రీ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఐదుగురు ఆడపిల్లల్లో వాణిశ్రీ చిన్నమ్మాయి. ఇంటర్‌ వరకు చదివిన వాణిశ్రీ నాలుగేళ్ల పాటు కూలి పనులకెళ్లారు. 2006లో ఉపాధి హామీ పథకం రావడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచీ మరో వ్యాపకం లేకుండా విధులకు అంకితమయ్యారు. 2008–09 సంవత్సరాల్లో తల్లిదండ్రులు కాలం చేశారు. ఒకప్పుడు కట్నం ఇవ్వలేక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేకపోయారు. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో ఆమె జీవితం లేదు.

కోరిక తీర్చు.. లేదా డబ్బులు కట్టు!
ఈ నేపథ్యంలో పైఅధికారి కన్ను తనపై పడుతుందని ఆమె ఊహించలేదు. అతని బుద్ధి తెలిసి కుంగిపోయారు. డబ్బుకి పేదనైనా.. గుణానికి కాదంటూ అతని కోరికను తిరస్కరించారు. అదే ఆమె చేసిన నేరమన్నట్లు ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఉన్నవి, లేనివి కల్పించారు. రికార్డులు తారుమారు చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమెను విధులకు రావొద్దన్నారు. ఆపై ఈ నెల 16వ తేదీన ఉద్యోగంలోంచి తొలగించారు. ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాలి లేదా.. రూ.30 వేలైనా ఇవ్వాలని పైఅధికారి చేసిన ప్రతిపాదన విని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం కోసం డ్వామా పీడీకి, జిల్లా కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

విచారించాకే చర్యలు
ఫిబ్రవరి నుంచి వాణిశ్రీ విధులకు హాజరు కావడం లేదు. దీనిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశాం. ఆమె స్థానంలో జన్మభూమి కమిటీ సూచించిన వ్యక్తిని నియమించాం. – శ్రీహరి,
ఐదు మండలాల క్లస్టర్‌ ఏపీడీ.

ఆమె మాటలు అవాస్తవం
ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వాణిశ్రీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆమెను ఏ రకంగానూ వేధించలేదు. విధి నిర్వహణలో ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటుంది. రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. ఆమెను తొలగించడానికి ఇంకా చాలా కారణాలున్నాయి. ఆమె స్థానంలో ఎవరో ఒకరిచే పనిచేయించుకోవాలి కాబట్టి వేరొకరిని నియమించుకున్నాం.  – పి.కామేశ్వరరావు, ఉపాధి హామీ ఏపీవో, జామి మండలం.


 

మరిన్ని వార్తలు