కడుపు మాడ్చుతున్న ఉపాధి 

4 Mar, 2019 15:51 IST|Sakshi
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

మూడు నెలలుగా కూలీలకు అందని వేతనాలు 

మొత్తం రూ.153 కోట్లు పెండింగ్‌ 

కూలీలకు అందాల్సిన వేతనాలు రూ.50 కోట్లు 

పట్టించుకోని ప్రభుత్వం 

జిల్లాలో కరువు తీవ్ర రూపం దాల్చి విలయతాండవం చేస్తోంది. కనీసం మేరకు పంటలు కూడా లేక వ్యవసాయ భూములు బీళ్లుగామారి ఎడారిని తలపిస్తోంది. కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఉపాధి పనులైనా ఆదుకుంటాయన్న ఆశ కూడా కూలీలకు కానరావడం లేదు. నెలల తరబడి ఉపాధి పనులు చేస్తున్నా వేతనాలు అందక ఇక్కట్లు పడుతున్నారు. 

సాక్షి, చిత్తూరు:బతుకు జీవనం కోసం ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాల మొత్తాన్ని తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద  జిల్లాలో మొత్తం 47,206 శ్రమ శక్తి సంఘాల ద్వారా  6,41,061 మందికి జాబ్‌  కార్డులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ఇప్పటి వరకు రూ.622.07 కోట్ల మేరకు వెచ్చించి ఉపాధి పనులు చేశారు. మొత్తం 1.69 లక్షల పనులు చేపట్టగా 85 వేల పనులు పూర్తయ్యాయి. మరో 84 వేల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 2,76,402 కుటుంబాలకు చెందిన 4,47,354 మంది కూలీలకు 1,62,53,426 పనిదినాలు కల్పించడం జరిగింది. అందులో పురుషులు  2,01,978 మంది, మహిళలు 2,45,376 మంది ఉన్నారు.


అందని వేతనాలు
గత ఏడాది డిసెంబర్‌ 2వ తేది నుంచి ఇప్పటి వరకు చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 1.25 లక్షల మంది కూలీలకు 25.14 లక్షల పని దినాలకు గాను రూ. 50,29,57,865 మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అదేగాక మెటీరియల్‌ కాంపెనెంట్‌ కింద రూ. 103.85 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అందులో పంచాయతీరాజ్‌ పనులకు రూ. 65.69 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కూలీల వేతనాలు, మెటీరియల్‌ కాంపెనెంట్‌ మొత్తం రూ. 154 కోట్ల మేరకు ఉపాధి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 


పట్టించుకోని ప్రభుత్వం
జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాధారణంగా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు శనివారం వేతనాలను అందించాల్సి ఉంది. ఈ వేతనాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా కూలీల బ్యాంకు, పోస్టాఫీసుల్లోని ఖాతాలకు జమచేయాల్సి ఉంది. అయితే గత డిసెంబర్‌ 2 నుంచి ఇప్పటి వరకు వేతనాలు పూర్తిగా నిలిచిపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. దీని ప్రభావంతో కూలీల సంఖ్య 90 వేల నుంచి 65 వేలకు పడిపోయింది. 


వేతనాలు అందక.. పనులులేక
ఉపాధి హామీ పనుల వేతనాలు నెలల తరబడి రాకపోవడంతో కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇతర పనులకు వెళ్లాలన్నా కరువు పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు కూడా అంతంత మాత్రంగా ఉంది. దీంతో కూలీలకు ఇతర పనులు దొరక్క, ఉపాధి పనులకు వెళ్లలేక అవస్థలు పడాల్సి వస్తోంది. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఇప్పటికే వేలాది మంది  కూలీలు తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వలసలు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ చాలీచాలని బతులతో జీవనం సాగిస్తున్నారు. ముఖ్యమంతి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోనే నిత్యం సుమారు 10 వేల మంది కూలీలు ఉదయం బెంగళూరుకు వెళ్లి కూలీ పనులు చేసి రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. 

 

మరిన్ని వార్తలు