పారిశ్రామిక మేడలు..!

17 Jan, 2020 11:25 IST|Sakshi
పారిశ్రామిక వాడలో వాణిజ్య సముదాయం

వెలుస్తున్న వాణిజ్య సముదాయాలు 

రాయితీ రుణాలతో నిర్మాణాలు 

నిరుద్యోగిత ముసుగులో వ్యాపారం

మూతపడుతున్న సూక్ష్మ పరిశ్రమలు  

గత ప్రభుత్వ పాలకుల నిర్వాకం  

ఎచ్చెర్ల క్యాంపస్‌: పేరుకు పారిశ్రామిక వాడలు.. అక్కడ వెలుస్తున్నాయి కమర్షియల్‌ మేడలు.. నిరుద్యోగిత ముసుగులో కొంతమంది వ్యాపారులు దర్జాగా వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని, 16వ నంబరు జాతీయ రహదారి పక్కన ఉండటంతో పారిశ్రామిక వాడ స్థలాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. గత టీడీపీ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోపాటు ఏపీఐఐసీ అధికారులతో లాలూచీ పడి పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు పొందినట్టు తెలుస్తోంది.  

ఇదీ ఏపీఐఐసీ లక్ష్యం...  
నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా పోత్సహించాలి. సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగి పది మందికి ఉపాధి కల్పించాలి. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన శాఖ (ఏపీఐఐసీ) లక్ష్యం. అధికారుల పర్యవేక్షణ లోపం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు కంటే వ్యాపారులకు వాణిజ్య సముదాయాలు నిర్మాణం, అద్దెలకు ఇచ్చేందుకు ఈ పారిశ్రామికవాడ ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్‌ వ్యాపార గోదాములు, కార్యాలయాలు వంటివి నిర్వహణకు అద్దెకు ఇచ్చుకునేందుకు అనువైన స్థలం కావటంతో ఎక్కువ మంది వ్యాపార సముదాయాల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్నారు.

 
పారిశ్రామిక వాడలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు.... 
కుశాలపురం సమీపంలోని నవభారత్‌ పారిశ్రామికవాడ 16.37 ఎకరాలు విస్తరించి ఉంది. నిరుద్యోగ యువతకు పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు కేటాయిస్తారు. పరిశ్రమలు మూతపడితే స్థలాలు ఏపీఐఐసీ స్వా«దీనం చేసుకుని, మరొకరికి ఇవ్వాలి. ప్రస్తుతం 55 పరిశ్రమలు ఉండగా, ఇందులో 12 పరిశ్రమలు మూతపడ్డాయి. స్టీల్, గ్రానైట్, అల్యూమినియం, గార్నటైట్, రంగులు, రీ ట్రైడ్‌ వంటి పరిశ్రమలు ఉన్నాయి. గత ప్రభుత్వం సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించకపోవటం, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకోకపోవటం వంటి అంశాల వల్ల కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఇదేక్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ (వాణిజ్య సముదాయాలు)ను నిర్మిస్తున్నారు. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని అద్దెకు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఐదు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఈ పారిశ్రామిక వాడలో ఉండటం గమనార్హం.

పరిశ్రమల స్థాపన పేరిట రాయితీలు... 
పరిశ్రమల ఏర్పాటు పేరుతో బ్యాంకుల నుంచి రాయితీ రుణాలు సైతం కొందరు తీసుకుంటున్నారు. వీటితో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకున్న విధంగా పరిశ్రమ నిర్మాణం చేపట్టాలి. లేదంటే అధికారులు స్థల మంజూరును రద్దు చేయాలి. ఇలా చేయడం లేదు. దీంతో నిరుద్యోగుల స్థానంలో వ్యాపారులు ప్రయోజనాలు ఎక్కువుగా పొందుతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేపడుతున్నారు. ఏపీఐఐసీ శాఖ స్పందించకుంటే భవిష్యత్తులో ఇక్కడ సూక్ష్మ పరిశ్రమలు సైతం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.   

నిబంధనల అమలుకు కృషి 
వాణిజ్య సమదాయాల నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకం. స్థలాలు పొందిన వారు నిబంధనలు పక్కాగా పాటించాలి. స్థలాలు తీసుకున్నప్పుడు దరఖాస్తులో పేర్కొనేలా నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు ఉండాలి. దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. 
– సుధాకర్, ఏపీఐఐసీ, జోనల్‌ మేనేజర్‌  

మరిన్ని వార్తలు