అర్ధరాత్రి దర్గా కూల్చివేత

3 Nov, 2017 09:07 IST|Sakshi
మైదుకూరు: రోడ్డుపై ఆందోళన చేస్తున్న ముస్లింలను అడ్డుకుంటున్న పోలీసులు

ఉదయం నుంచి  సాయంత్రం వరకు ముస్లింల ఆందోళన

అర్ధరాత్రి సమయంలో  కూల్చివేత అప్రజాస్వామికం

ఆగ్రహం వ్యక్తం చేసిన  వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు

దిగివచ్చిన అధికారులు

మైదుకూరు టౌన్‌ : ప్రజల మనోభావాలు దెబ్బతినే  రీతిలో అర్ధరాత్రి సమయంలో దర్గా కూల్చివేత తగదని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. 200 ఏళ్లనాటి దస్తగిరి స్వామి దర్గాను బుధవారం అర్ధరాత్రి కూల్చివేయడంలో రెవెన్యూ అధికారులు ఇష్టాను సారంగా వ్యవహరించారని ఎమ్మెల్యే మండిపడ్డాడు. రోడ్డుకు అడ్డంగా ఉంటే ప్రజలకు తెలియజేసి వివరించాలేకానీ ఇళ్లలోనుంచి ప్రజలను బయటకు రాకుండా విద్యుత్‌ దీపాలను అర్పి చీకటిలో తొలగించడం సిగ్గుచేటన్నారు. ఒక పెద్ద వేపచెట్టును ఎలాంటి ఆనవాళ్లు లేకుండా రాత్రికిరాత్రి రెండు జీసీబీలతో తీసివేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో దర్గా విషయంపై చర్చించామని, కాస్త రోడ్డుకు లోపలి భాగంలో కట్టుకుంటామని తెలిపితే సరేనన్న అధికారులు అర్ధాంతరంగా ఇలా ఎందుకు చేశారో సమాధానం చెప్పాలన్నారు. దర్గా సమీపంలోని  వీధిలో ముస్లిం ప్రజలను ఇంటిలో పెట్టి బయట పోలీసులను కాపలా ఉంచడం అసలు ప్రజాస్వామ్యమేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దర్గా తొలగింపు విషయం స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు.

రోడ్డుపై బైఠాయింపు
ప్రతి జెండా పండుగకు తాము ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసే దర్గా లేకపోవడంతో ముస్లింలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. దర్గా ఎదురుగా ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ రంగసింహాకు ఈ విషయం తెలియదా? అని ఆయన ఎదుట కాసేపు ధర్నా నిర్వహించారు. తొలగించిన ప్రదేశంలో మళ్లీ దర్గాను ఏర్పాటు చేయాలని పట్టుబట్టి ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు బైఠాయించారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు దిగివచ్చి తొలగించిన ప్రదేశంలోనే నాలుగు అడుగల స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని అనుమతి ఇచ్చారు. దర్గా అనుమతి కోసం కృషి చేసిన ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డికి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆందోళనలో వైఎస్సార్‌సీపీ జాతీయ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు రెహమాన్, రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్‌బాషా, జమ్మలమడుగు నాయకులు గౌజ్‌లాజా, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్‌ కందునూరు జిగినీ, కొండపేట షరీఫ్, మత గురువులు ఫజిల్‌ రహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు