బకాయిల వడ్డన

3 May, 2019 12:07 IST|Sakshi
విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు

నాలుగు నెలల బిల్లులకు ఎదురుచూపులు

మధ్యాహ్న భోజన కార్మికుల అవస్థలు

ఎప్పుడొస్తాయో తెలియని వైనం

అప్పు చేసి పెడుతున్నా స్పందన లేదు

రెండు నెలల మొత్తాలు మాత్రమేవిడుదల

హెల్పర్ల జీతాలకూ తప్పని తిప్పలు

జనవరి నుంచి నిలిచిపోయిన మధ్యాహ్న భోజన బిల్లులు

అప్పుచేసి పప్పన్నం అందిస్తున్నా వారిని ఆదుకునే వారు లేరు. నిధులను సైతం సమకూర్చకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు.ఒకరోజు కాదు.. రెండురోజులు కాదు.. రోజూక్రమం తప్పకుండా ఆహారం మెను ప్రకారంవిద్యార్థులకు అందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారులు పట్టించుకోని తీరు వెరసిఅన్నం పెట్టే మహిళలకు ఆకలి బాధలుకలిగిస్తున్నాయి. నెలల తరబడి బిల్లులుఅందకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. ఉన్నత పాఠశాలల్లో ఏకంగానెలకు రూ. లక్ష వరకు బిల్లు వస్తుంది. మరీమూడు, నాలుగు నెలలు అందకపోతే వారుఎలా సరుకులు కొనాలి.. పిల్లలకు ఎలాఅందించాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ సర్కార్‌ ఐదేళ్లలోనూమధ్యాహ్న భోజన కార్మికులతో ఆడుకుంటుందనే విమర్శలున్నాయి.చివరకు హెల్పర్ల జీతాల విషయంలోనూ అలసత్వం కనిపిస్తోంది.

సాక్షి కడప : మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జనవరి  నుంచి ఇప్పటివరకు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలకు చెల్లించాల్సి ఉంది. కరువు నేపథ్యంలో జిల్లాలో అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సెలవుల్లో కూడా అమలు చేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. నాలుగు నెలల బిల్లులు పెండింగ్‌ ఉండటంతో సెలవుల్లో ఆహారం సరఫరా చేయడానికి చాలామంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాపై నెలకు సరాసరిన రూ. 1.60 కోట్లు బిల్లు అవుతోంది. నాలుగు నెలలకు  దాదాపు రూ. 6 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది. నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రెండు రోజుల నుంచి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల, హెల్పర్ల జీతాలు పెండింగ్‌ మొత్తాలు ఖాతాలకు జమ చేస్తున్నారు.

జీతాలకు తప్పని ఎదురుచూపులు
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతన వేతలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 5745 ఏజెన్సీలలో 11,490  మంది హెల్పర్లు, ఆయాలున్నారు. వారందరికీ గౌరవ వేతనంగా  చెల్లించే రూ.1000 మొత్తాన్ని కూడా ఆలస్యం ప్రభుత్వం చేస్తోంది. నెలకు ఇచ్చే  స్వల్ప మొత్తం కూడా జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. జీతాలకు కూడా వారు నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఇదే తంతు కొనసాగుతోంది. సక్రమంగా నెలనెల బిల్లులు అందించిన పరిస్థితులు దాదాపు లేవనే చెప్పవచ్చు. ప్రతిసారి మూడు, నాలుగు నెలలకు ఒకసారి పెండింగ్‌ మొత్తాలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎప్పుడు చూసినా ఇదే రకంగానే వెళుతున్నారు తప్ప సక్రమంగా నెలనెల అందించిన పాపాన పోలేదు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు మొదలుకొని హెల్పర్లు, ఆయాల జీతాలు కూడా ఇదే పరిస్థితిలోనే కొనసాగాయి. ఏది ఏమైనా ఐదేళ్లు వారు కష్టాలతోనే ముందుకు సాగుతూ వచ్చారు. మధ్యాహ్న భోజన బిల్లులెప్పుడు వస్తాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలల బిల్లులు రావాల్సిన నేపధ్యంలో తర్వాత ప్రభుత్వం మారితే వస్తాయో, రావోనన్న ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. ప్రస్తుత సర్కార్‌ వారి బిల్లుల విషయంలో అయినా వెంటనే మంజూరు చేసి అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఐదేళ్లలో బిల్లులన్నీ పెండింగ్‌లో  పెడుతూ వచ్చినా..
కనీసం చివరిలోనైనా అందించి ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు