మధ్యాహ్న భోజనంబు.. అధ్వాన వంటకంబు!

15 Dec, 2018 13:45 IST|Sakshi
జూపాడుబంగ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాణ్యత లేని భోజనం వండిన దృశ్యం

‘తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌..’ అన్నారు గురజాడ అప్పారావు. మంచి తిండి తిన్నప్పుడే శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయి. భావి పౌరులైన విద్యార్థులకు పౌష్టికాహారం ఎంతో అవసరం. అయితే..ప్రభుత్వ పాఠశాలల్లో వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనంలో పౌష్టికత దేవుడెరుగు.. కనీస నాణ్యత కూడా పాటించడం లేదు. హైకోర్టుఅక్షింతలు వేసినా..క్షేత్రస్థాయిలో మార్పుకన్పించడం లేదు. పలుచోట్ల ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డిస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో స్కూల్‌ పిల్లలకు నాణ్యమైన ఆహారం అందని ద్రాక్షే అవుతోంది. శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కన్పించాయి.

కర్నూలు సిటీ/ సాక్షి నెట్‌వర్క్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ, విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రభుత్వ ప్రకటనలకు.. వాస్తవ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వకపోవడం, అరొకర బిల్లులు కూడా రెగ్యులర్‌గా చెల్లించకపోవడం.. బియ్యం సక్రమంగా అందించకపోవడం తదితర కారణాలతో మధ్యాహ్న భోజనం అధ్వానంగా మారుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పథకాన్ని నిర్వహిస్తున్న స్వయం సంఘాలకు చెందిన ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. ముద్దలాంటి అన్నం.. నీళ్ల లాంటి చారు.. ఉడకని పప్పు.. కుళ్లిన గుడ్లు.. కూరగాయలు లేని సాంబారు.. వీటితోనే విద్యార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. వంట గదుల్లేక ఆరుబయట మండని పొయ్యిలతో వండిందే మెనూ.. పెట్టిందే తినూ అన్నట్లుగా పథకాన్ని మార్చేశారు. జిల్లాలో 517 పాఠశాలల్లో వంట గదులు శిథిలావస్థకు చేరుకోగా, 1078 పాఠశాలల్లో అసలు గదులే లేకపోవడంతో ఆరు బయటనే వంట చేస్తున్నారు.  1445 స్కూళ్లలకు తాగునీటి సరఫరా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వంట ఏజెన్సీలకు భోజనం తయారు చేసేందుకు గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. అయితే హైస్కూళ్లలో ఉండే విద్యార్థుల సంఖ్యతో ఆ గ్యాస్‌ సరిపోవడం లేదని, అదనపు సిలిండర్లు ఇవ్వాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు. 

బిల్లులు పెండింగ్‌..
జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల వరకు బిల్లులు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్‌ సంబంధించిన బిల్లులు  2.82 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అలాగే వంట ఏజెన్సీల కార్మికులకు సుమారుగా 1.40 లక్షల వేతనాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.   మధ్యాహ్న పథకం అమలుకు నవప్రయాస్‌ సంస్థకు అప్పగించిన నేపథ్యంలో ముందుగా కల్లూరు, కర్నూలు మండలాల పరిధిలోని 21 పాఠశాలలకు భోజనాలను అందించేందుకు పెద్దపాడు సమీపంలో కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ వంటశాల నుంచి ఈ నెల 10,11 తేదీల్లో సరఫరా చేశారు. ఇక్కడ తయారు చేసిన భోజనం నాణ్యత లేక పోవడం, నరగంలోని ఓ స్కూల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ వంటశాలను కొద్ది రోజులుగా బంద్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాల ఇచ్చారు. మళ్లీ పాత ఏజెన్సీలే భోజనాలు తయారు చేసి పెడుతున్నారు.     

మొదటనే విఫలం.. 
మధ్యాహ్న పథకం అమలుకు నవప్రయాస్‌ సంస్థకు అప్పగించిన నేపథ్యంలో ముందుగా కల్లూరు, కర్నూలు మండలాల పరిధిలోని 21 పాఠశాలలకు భోజనాలను అందించేందుకు పెద్దపాడు సమీపంలో కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేశారు. ఈ వంటశాల నుంచి ఈ నెల 10,11 తేదీల్లో సరఫరా చేశారు. ఇక్కడ తయారు చేసిన భోజనం నాణ్యత లేక పోవడం, నరగంలోని ఓ స్కూల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ వంటశాలను కొద్ది రోజులుగా బంద్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాల ఇచ్చారు. మళ్లీ పాత ఏజెన్సీలే భోజనాలు తయారు చేసి పెడుతున్నారు.     

ప్రైవేటు సంస్థకు అప్పగింతతో కార్మికులకు కష్టాలు
జిల్లాలోని 15 మండలాల్లో పరిధిలోని ఐదు చోట్ల కేంద్రీయ వంటశాలలను ఏర్పాటు చేసి నవ ప్రయాస్‌ ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. పెద్దపాడు దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాల నుంచి 211 స్కూళ్లకు, నంద్యాల–198, ఎమ్మిగనూరు–131, పత్తికొండ–153, డోన్‌ పరిధిలోని ఏర్పాటు చేసే వంటశాల నుంచి 121 స్కూళ్లకు భోజనాలు అందించనున్నారు. ఈ సంస్థకు అప్పగించడంతో మొత్తం 814 స్కూళ్లలో 2140 మంది హెల్పర్స్‌ రోడ్డన పడ్డే అవకాశం ఉంది. దీనికి తోడు ఇన్నాళ్లు విద్యార్థుల ఆకలి తీర్చేందుకు అప్పులు చేసి వంటిపెట్టిన మహిళ సంఘాలను కాదని ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై వంట ఏజెన్సీ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు.

ఇది ఆకుకూర పప్పు !
ఆస్పరి మండలంలోని శంకరబండ ప్రాథమిక పాఠశాల్లో మెనూ ప్రకారం శుక్రవారం ఆకు కూర పప్పు, అన్నం వడ్డించాల్సి ఉండగా నీళ్లు పప్పునే విద్యార్థులకు వడ్డించారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 107 మందికి గాను 69 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రధానోపాధ్యాయుడు శంకర్‌ తెలిపారు. మెనూ ప్రకారం ఆకు కూరపప్పు వడ్డించాల్సి ఉండగా వంకాయ, టమోటాతో చేసిన నీళ్ల పప్పును విద్యార్థులకు వడ్డించారు. దీంతో రుచికరంగా లేకున్నా అదే  భోజనాన్నే తిన్నారు.

మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపైహైకోర్టు ఏమందంటే..
‘ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనంలో పిల్లలకు వడ్డిస్తున్న ఆహారాన్ని జంతువులు కూడా తినవు. ఒక వేళ తిన్నా అవి బతికి బట్టకట్ట లేవు. కాంట్రాక్టర్లకు లాభా పేక్ష తప్ప విద్యార్థుల ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టడం లేదు. కుళ్లిన, పగిలిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తూ పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారులు, పాఠశాల హెచ్‌ఎంలు ఏమి చేస్తున్నారు. రెండు కుళ్లిన కోడి గుడ్లను వారి నోట్లో కుక్కితే అప్పుడు పిల్లలు పడే బాధలు ఏమిటో వారికి తెలుస్తాయి. శుభ్రమైన, నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని పొందే హక్కు ప్రతి విద్యార్థికీ ఉంది. ప్రతి స్థాయిలో జరుగుతున్న అవినీతి, పర్యవేక్షణ లోపం వంటి కారణాల వల్లే మధ్యాహ్న భోజన పథకం అమలు పరిస్థితి ఇలా తయారైంది’ అంటూ ఘాటుగా స్పందించింది. ప్రకాశం జిల్లాలో ఓ స్కూల్‌ విద్యార్థులకు చెందిన తల్లిదండ్రుల లేఖను పరిగణనలోకి తీసుకుని మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై విచారణ చేస్తోంది.  

మరిన్ని వార్తలు