వంటకు మంట!

12 Nov, 2018 08:55 IST|Sakshi
పాఠశాలల్లో వంటకు వాడుతున్న విజయ నూనె ప్యాకెట్‌ ధర రూ.90.60

నూనె, కందిపప్పు ప్రైవేటు నుంచి సరఫరా

ధర ఎక్కువ.. బరువు తక్కువ

కుకింగ్‌ ఏజెన్సీల నుంచి భారీగా కోత

ఇదీ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు

నిడమర్రు: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించే మధ్యాహ్న భోజన పథకం అమలులో సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు వంట కార్మికుల పొట్టకొట్టి.. ప్రైవేటు కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయి. గతంలో వంటకు అవసరమైన కందిపప్పు, నూనెను (పామోలిన్‌) వంట ఏజెన్సీ నిర్వాహకులే సమకూర్చుకునేవారు. గత నెల నుంచి ఈ రెండు సరుకులు కాంట్రాక్ట్‌ ఏజెన్సీల నుంచి సరఫరా అవుతున్నాయి. దీంతో ఇప్పటివరకూ వంట నిర్వాహకులకు అందించే కుకింగ్‌ చార్జీల్లో భారీగా కోత పడనుంది. పంపిణీ చేస్తున్న సరుకుల మార్కెట్‌ ధరల కంటే ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్న రేటు అధికంగా ఉండటమే కాకుండా ప్యాకెట్ల బరువులోనూ వ్యత్యాసంఉందని మధ్యాహ్న భోజన కార్మికులు చెబుతున్నారు. కుకింగ్‌ చార్జీలు పెంచాలని ఆందోళన చేస్తుంటే , ఇస్తున్న అరకొర చార్జీల్లోనూ సరుకుల సరఫరా పేరుతో కోతలు విధించి మా పొట్టకొడుతున్నారని, ఆ మొత్తాన్ని  కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

తూకం, ధరల్లో వ్యత్యాసం ఇలా..
పామోలిన్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన మార్గదర్శకాల మేరకు 5గ్రా నూనెకు ప్రభుత్వం రూ.0.58 చెల్లిస్తుంది. ఆమేరకు కిలోనూనె రూ.116 అవుతుంది. పాఠశాలలకు సరఫరా చేసిన విజయ పామోలిన్‌ ప్యాకెట్‌పై ఉన్న ధర  రూ.90.60, హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో పామోలిన్‌ ధర రూ.70 లోపే. దీంతో ధరలో 40శాతం పైగా కార్మికులు నష్టపోతున్నారు. ప్రైవేటు కంపెనీలు దోచుకుంటున్నాయి. ప్యాకెట్ల తూకం కూడా కచ్చితంగా కిలో లేదు.   900 గ్రాముల బరువే తూగుతుంది.  

కందిపప్పులోనూ తేడానే
కాంట్రాక్టర్‌ నుంచి సరఫరా చేస్తున్న కందిపప్పు కిలోకు రూ.69ను ప్రభుత్వం చెల్లిస్తోంది. రేషన్‌ దుకాణాల్లో అదే కందిపప్పు రాయితీపై రూ.40కు లభిస్తుంది. బయట మార్కెట్‌లో రూ.60 నుంచి రూ.65 వరకూ ఉంది. కందిపప్పును ఒక కిలో, పది కిలోల ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు. వీటి తూకాల్లోనూ స్వల్పంగా తేడాలు కనిపిస్తున్నట్లు హెచ్‌ఎంలు చెబుతున్నారు. కిలో ప్యాకెట్‌ కవర్‌తో సహా 980 గ్రాములు వరకూ ఉంటున్నట్టు పేర్కొంటున్నారు.

నూనెలో భారీగా కోత
మధ్యాహ్న భోజన పథకానికి జిల్లాలో నెలకు సుమారు 7,239 ప్యాకెట్లు వాడతారని అంచనా. దీనికి కుకింగ్‌ చార్జీల్లో తగ్గిస్తున్న మొత్తం రూ.8.38లక్షలు. అయితే మార్కెట్లో నూనె ధర ప్రకారం.. వినియోగిస్తున్న ప్యాకెట్లకు రూ.5.06లక్షలే ఖర్చవుతుంది. ఈ లెక్కన ఏజెన్సీల నుంచి అదనంగా రూ.3.32 లక్షలు కోత విధించి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నట్టు వంట ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి.  
తాజా మార్గదర్శకాల్లో

పప్పు, నూనె కేటాయింపు ఇలా
సోమవారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో ప్రైమరీ యూపీ స్కూల్స్‌ విద్యార్థికి 10గ్రాములు పప్పు, హైస్కూల్, కాలేజీ  విద్యార్థికి 15 గ్రాముల పప్పు, గురువారం, శనివారం రోజుల్లో ప్రైమరీ విద్యార్థికి 20గ్రాముల పప్పు, హైస్కూల్, కాలేజీ విద్యార్థికి 30 గ్రాముల  పప్పు చొప్పున ఇవ్వాలి. మంగళవారం కూరగాయలతో తయారైన కూర వల్ల పప్పు ఇవ్వరు. నూనె విషయంలో ప్రైమరీ, యూపీ స్కూల్స్‌ విద్యార్థికి 5గ్రాములు, హైస్కూల్స్, కాలేజీ విద్యార్థికి 7.5 గ్రాములు చొప్పున కేటాయించారు.

40 శాతం  కష్టం నష్టపోతున్నాం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నూనె ధరలో 40 శాతం నగదు నష్టపోతున్నాం. మాకు పంపిణీచేసే  విజయ నూనె ప్యాకెట్‌పైనే ఎంఆర్పీ ధర రూ.90.60పై ఉంది. కానీ మాకు చెల్లించే సొమ్ము నుంచి రూ.116 కోత విధిస్తామంటున్నారు. దీని వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతాం. చాలా చోట్ల లాభం ఆశించకుండా మా పిల్లలే అనుకుని వంట వండుతున్నాం.  –చీకట్ల లక్ష్మి, ఎండీఎం నిర్వాహకులు, బువ్వనపల్లి

మరిన్ని వార్తలు