‘మధ్యాహ్న భోజన’ కార్మికులకు తీపి కబురు

1 Jun, 2019 12:50 IST|Sakshi

గౌరవ వేతనం రూ.3 వేలకు పెంపు

సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం

జిల్లాలో 7,020 మందికి లబ్ధి

పథకానికి ‘వైఎస్సార్‌ అక్షయపాత్ర’గా నామకరణం

హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు  

కర్నూలు సిటీ: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాలు పెంచుతూ ఆదేశాలిచ్చారు. అదే విధంగా పథకానికి ‘వైఎస్సార్‌ అక్షయ పాత్ర’గా పేరు పెట్టారు. 

టీడీపీ హయాంలో ప్రైవేటుకు అప్పగింత
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు  వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత ఆయా గ్రామాలు, వార్డుల్లోని పొదుపు సంఘాలకు అప్పగించారు. విద్యార్థుల సంఖ్యను బట్టి వంట ఏజెన్సీల కార్మికులకు గౌరవ వేతనాలు ఇచ్చే వారు. అయితే ఆయన తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు కార్మికులకు పైసా కూడా గౌరవ వేతనాలు పెంచలేదు. పైగా 2014 తరువాత తెలుగు దేశం ప్రభుత్వం ఈ పథకం నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి, వంట ఏజెన్సీల కార్మికుల కడుపు కొట్టింది. ఆ సమయంలో  కార్మికులు  విజయవాడలో ఆందోళనలు చేస్తే పోలీసులతో కొట్టించింది. ఆ తరువాత గౌరవ వేతనం రూ.2 వేలు ఇస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు.  

జిల్లాలో 7,020 మంది కార్మికులు..  
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1927, ప్రాథమికోన్నత పాఠశాలలు 389, ఉన్నత పాఠశాలలు 554 ఉన్నాయి. ఈ స్కూళ్లలో 3,82,236 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అమలయ్యే స్కూళ్లలో ఉన్నారు. అయితే వీరిలో సుమారు 2.48 లక్షల మంది విద్యార్థులు రోజు వారీగా మధ్యాహ్న భోజనం తింటున్నారు. వీరికి భోజనాలు చేసేందుకు జిల్లాలో 2,930 మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 7,020 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి గతంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వెయ్యి రూపాయలు మాత్రమే వచ్చేది. ప్రస్తుతం గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచడంతో ప్రభుత్వంపై నెలకు రూ. 2.10 కోట్లు భారం పడుతుంది.

హామీ  నెరవేర్చిన వైఎస్‌ జగన్‌ ..
ఎన్నికలకు ముందు నుంచే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచి  సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే వెయ్యి నుంచి మూడు వేల రూపాయలకు గౌరవ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనపై మధ్యాహ్నా భోజన పథకం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గౌరవ వేతనం పెంచడంసంతోషదాయకం
ముజపర్‌ నగర్‌లోని ఎంపీయూపీ స్కూల్లో వంట ఏజెన్సీ కార్మికురాలుగా పని చేస్తున్నాను. చాలా రోజులుగా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. కొత్త సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.3 వేలకు గౌరవ వేతనం పెంచడం సంతోషంగా ఉంది. ప్రైవేటు ఏజెన్సీని తొలగించి గతంలో మాదిరిగానే పొదుపు మహిళలకే అప్పగిస్తే బాగుంటుంది.– రుక్మిణమ్మ, ఎంపీయూపీ స్కూల్, ముజఫర్‌ నగర్, కల్లూరు మండలం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు