ఆ ‘భోజనం’ లోగుట్టు బట్టబయలు

6 Aug, 2016 06:05 IST|Sakshi
ఆ ‘భోజనం’ లోగుట్టు బట్టబయలు
  • ద్విసభ్య కమిటీని నియమించిన డీఈవో
  • పాఠశాలల్లో మేయర్‌ ఆకస్మిక తనిఖీలు
  • రాజమహేంద్రవరం :
    ఇస్కాన్‌ మధ్యాహ్న భోజనం లోగుట్టు బట్టబయలైంది. పాఠశాలలకు ఆ సంస్థ అందిస్తున్న భోజనం తినలేక విద్యార్థులు పడవేయడం.. అనారోగ్యం పాలవడం వంటి అంశాలపై ఈ నెల మూడో తేదీన ‘ఆ భోజనం మాకొద్దు బాబోయ్‌’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ వ్యవహారంపై విచారణకు డీఈవో నరసింహారావు.. డీవైఈవో అబ్రహం, రూరల్‌ ఎంఈవో నరసింహరెడ్డిలతో ద్విసభ్య కమిటీని నియమించారు. వారు పలు స్కూళ్లకు తిరిగి ఇస్కాన్‌ భోజనంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించనున్నారు.

    మరోపక్క రాజమహేంద్రవరం మేయర్‌ పంతం రజనీశేషసాయి శుక్రవారం పలు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. నాణ్యత లేని ఆ భోజనం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా మధ్యాహ్న భోజన సమయానికి స్కూళ్ల వద్దకు మేయర్‌ చేరుకున్నారు. విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోతూండడంతో ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నించారు. ఇక్కడ భోజనం తినలేకపోతున్నామని వారు మేయర్‌కు చెప్పారు. వెంటనే ఆమె మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. రుచి లేని భోజనం, నీళ్ల మజ్జిగ, ముద్దయిన అన్నం, నాసిరకం అరటిపండ్లు కనిపించాయి.

    మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్యకంటే ఎక్కువమంది తింటున్నట్టు రిజిస్టర్లలో నమోదవ్వడం, కావాల్సినట్టు మార్చుకునేందుకు దానిని పెన్సిల్‌తో రాయడం మేయర్‌ గమనించారు. టౌన్‌ హైస్కూలులో 350 మంది విద్యార్థులుండగా, వారిలో 150 మందే భోజనం చేస్తున్నారు. వారికి 22.50 కేజీల బియ్యం రిజిస్టర్‌లో నమోదవగా వాస్తవానికి అక్కడకు 10 కేజీల అన్నమే వచ్చింది. నన్నయ మున్సిపల్‌ హైస్కూలులో 750 మంది పిల్లలుండగా, 200 మందికే భోజనం వస్తోంది. ఈవిధంగా హెచ్‌ఎంలు, కొందరు ఇస్కాన్‌ సిబ్బంది పిల్లల పేరుతో నిధులు స్వాహా చేస్తున్నారని.. అందువల్లనే ఇస్కాన్‌ భోజనం బాగాలేక పిల్లలు కళ్లేదుటే చెత్తబుట్టలో పారేస్తున్నా.. హెచ్‌ఎంలు మాత్రం ‘భోజనం గుడ్‌’ అని నివేదికలిస్తున్నారని చెబుతున్నారు.

    వాస్తవంగా భోజనం చేస్తున్నవారికంటే విద్యార్థుల సంఖ్యను అధికంగా ఎందుకు నమోదు చేస్తున్నారని మేయర్‌ ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిన్న ప్లేట్లను విద్యార్థులే కడుక్కోవడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్లేట్లను ఆయాలు శుభ్రం చేయాలని, లేకుంటే వారిని తొలగిస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనం అమలు వి«ధానాన్ని తల్లిదండ్రులు గమనించాలని, లోపాలుంటే వెంటనే ఎండీఎం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. మేయర్‌ వెంట కార్పోరేటర్లు నండూరి రమణ, రెడ్డి పార్వతి, మర్రి దుర్గాశ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
మరిన్ని వార్తలు