భోజనం ప్రయాసే...

20 Dec, 2018 06:49 IST|Sakshi
మున్సిపల్‌ కస్పా ఉన్నత పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 1.30 సమయంలో మధ్యాహ్న భోజనం కోసం వేచి చూస్తున్న విద్యార్థులు

విద్యార్థులకు భోజన కష్టాలు...

నూతన విధానంతో సకాలంలో అందని మధ్యాహ్న భోజనం

మధ్యాహ్న తరగతుల సమయానికి చేరుకుంటున్న భోజనాలు

విద్యార్థులకు తప్పని ఆకలి మంటలు... సక్రమంగా సాగని చదువులు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న  నవ ప్రయాస సంస్థ ప్రతినిధులు

పట్టించుకోని మున్సిపల్, విద్యాశాఖ అధికారులు   

బడి ఈడు పిల్లలను బడి బాట పట్టించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ప్రయాసగా మారింది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే వంటలు చేసే నిర్వాహకుల స్థానే దీని అమలు బాధ్యతను నవ ప్రయాస సంస్థకు అప్పగించారు. దీంతో విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి.

విజయనగరం మున్సిపాలిటీ: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని నవ ప్రయాస సంస్థకు అప్పగించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సమయానికి భోజనం రావడం లేదు. విద్యార్థులకు ఆకలి కేకలు తప్పడం లేదు. ఫలితంగా విద్యార్థులు తరగతులకు సకాలంలో హాజరు కాలేకపోతున్నారు. విజయనగరం పట్టణంలోని పలు మున్సిపల్‌ పాఠశాలలకు మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన భోజనం రెండు గంటల వరకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

ఆదిలోనే హంస పాదు...
మధ్యాహ్న భోజన పథకం అమల్లో నూతన విధానానికి ఆదిలోనే  ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించటంలో   నవ ప్రయాస సంస్థ ప్రతినిధులతో పాటు, విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఈ పథకం ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ లోపాలను సవరించుకోలేకపోతున్నారు. ఆదివారం సాధారణ సెలవుతో పాటు సోమ, మంగళవారాల్లో పెథాయ్‌ తుఫాన్‌ కారణంగా మూత పడిన పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కాగా.. అదే పరిస్థితులు విద్యార్థులు చవిచూశారు.  సాధారణంగా  మున్సిపల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు 12.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని వడ్డించేవారు. ఈ ప్రక్రియను పాఠశాలల వారీగా నియమించిన నిర్వాహకులే చేపట్టేవారు. వారు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించేవారు. వారం రోజుల నుంచి  ఈ బాధ్యతలను నవ ప్రయాస సంస్థకు అప్పగించినప్పటి నుంచి విద్యార్థులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం నిర్ణీత సమయానికి రావాల్సిన భోజనం  2.10 గంటలకు  పాఠశాలలకు రావటంతో విద్యార్థులు ఖాళీ కంచాలు పట్టుకుని ఆకలితో అవస్థలు పడ్డారు. మధ్యాహ్న భోజనం ఎప్పుడు వస్తుందా! అంటూ ఎదురు చూశారు. చివరికి 2.10 గంటలకు భోజనం పాఠశాలలకు చేరుకోగా... కేవలం ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు మాత్రమే  తరగతులు మానుకుని భోజనం చేయగా.. ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. ఇలా మున్సిపల్‌ కస్పా ఉన్నత పాఠశాలకు చెందిన 1200 మంది విద్యార్థులతో పాటు రాధాస్వామి మున్సిపల్‌ పాఠశాల, కస్పా కాలేజ్, మున్సిపల్‌ ఉర్ధూ స్కూల్, అరిచెట్ల స్కూల్‌కు చెందిన విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు.

సక్రమంగా సాగని చదువులు
 చదువులు సైతం సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయానికి పలు పాఠ«శాలలకు భోజనం చేరకపోగా... తిరిగి తరగతులు పునఃప్రారంభ సమయానికి చేరుకోవటంతో విద్యార్థులు తరగతులు మానుకుని భోజనం చేయాల్సి వచ్చింది. దీంతో చదువులు సక్రమంగా సాగటం లేదని, మరి కొద్ది రోజుల్లో జరగనున్న పది పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు పరిస్థితి  ఆందోళనకరంగా మారిందని  విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.

‘నవ’ నిర్లక్ష్యం...
మధ్యాహ్న భోజన పథకం అమల్లో  నవ ప్రయాస సంస్థకు చెందిన ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అపవాదను ఆదిలోనే మూటగట్టుకుంటున్నారు. వాస్తవానికి ఈ సంస్థ విద్యాశాఖతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు  నెల్లిమర్ల  మండల కేంద్రం నుంచి  విజయనగరం పట్టణంలోని విద్యార్థులకు   మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయనున్నారు. ఇందుకు నవ ప్రయాస అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ కేవలం విజయనగరమే కాకుండా  నెల్లిమర్ల, డెంకాడ మండలాల పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయనుంది. నెల్లిమర్ల మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి వాహనాల ద్వారా  ఆహారాన్ని  పాఠశాలల వారీగా సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా   నూతన వి«ధానం అమల్లో నవ ప్రయాస సంస్థ ప్రతినిధులు మొదటి రోజే తడబాటుకు గురయ్యారు.  పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల నుంచి భోజనాన్ని తరలించే సమయంలో ఎటువంటి ఆటంకాలు  తలెత్తినా  ఆ రోజు విద్యార్థులు పస్తులు తప్పవన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇదే విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ టి.వేణుగోపాల్‌ వద్ద సాక్షి ప్రస్తావించగా... పలు పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనం అందించటంలో బుధవారం జాప్యం జరిగిందన్నారు. ఇదే విషయమై  జిల్లా విద్యాశాఖ అధికారితో చర్చించటం జరిగిందన్నారు. సమస్య పునరావృతం కాకుండా అవసరమై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు