అప్పు చేసి.. కోడి కూర!

3 Aug, 2018 12:40 IST|Sakshi

నాలుగు నెలలుగా అందని ‘డైట్‌’ బిల్లులు

గగనంగా మారిన ‘కొత్త మెనూ’ అమలు..

మార్పులు జరిగే అవకాశం

అప్పులు చేసి హాస్టళ్ల నిర్వహణ

ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, బీసీ హాస్టళ్ల హెచ్‌డబ్ల్యూఓలు

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ‘సంక్షేమం’ గుర్తుకొస్తోంది. ఇది అందరూ అనుకుంటున్న మాట. అందులోభాగంగా జూలై 1వ తేదీ నుంచి హాస్టల్‌ విద్యార్ధుల డైట్‌ బిల్లులను పెంచారు. కొత్త మెనూను అమలు చేస్తున్నారు. ఆ ప్రకారం మెనూలో భాగంగా విద్యార్ధులకు వారానికి మూడుసార్లు కోడి కూరను వడ్డిస్తున్నారు. అయితే నెలల తరబడి బిల్లులు అందకపోవడంతో కొత్త మెనూ అమలు కష్టతరంగా మారింది. వార్డెన్‌లు అప్పులు చేసి ఖర్చుపెట్టాల్సి రావడంతో ఇబ్బందులుపడుతున్నారు.

కడప నగరంలోని ఒక హాస్టల్‌లో 100మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఆ హాస్టల్‌ హెచ్‌డబ్ల్యూఓ (వార్డెన్‌)కు దాదాపుగా నాలుగు నెలలకు సంబంధించిన రూ 3.50లక్షలకు పైగా డైట్‌ బిల్లులు అందలేదు. దీంతో ఆయన అప్పులు చేసి హాస్టల్‌ను నెట్టుకొస్తున్నారు.

రాయచోటిలోని ఓ హాస్టల్‌లో 150మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న హెచ్‌డబ్ల్యూఓకు ఎంత లేదన్న ఒక నెలకు రూ.1.35లక్షలకుపైగా డైట్‌ బిల్లులు రావాలి. ఈ బిల్లులు రాకపోవడంతో అతను తెలిసిన వారినల్లా అప్పులడుగుతున్నారు. కష్టంగా మెనూ అమలు చేస్తున్నారు.

ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్న 139 మంది ప్రభుత్వ ఎస్సీ, బీసీ హాస్టల్‌ హెచ్‌డబ్ల్యూఓలు ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమందికి అప్పులు పుట్టక అవస్థలు పడుతున్నారు. పౌష్టికాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లు ముందస్తుగా నిధులు, ఏర్పాట్లు చేయాల్సిన విషయం మరిచిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కడప రూరల్‌: జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో (3 నుంచి 10వ తరగతి వరకు) 81 హాస్టళ్లు ఉన్నాయి. వీటిల్లో 8వేలమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 58 హాస్టళ్లలో 5వేలమందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టళ్లలో ప్రవేశాలు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా గడిచిన ఏడాది కూడా ఇంచుమించు ఇదే సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. తాజాగా విద్యార్థుల డైట్‌ బిల్లులు రాకపోవడంతో వారికి మెనూను అమలుచేయాలంటే హెచ్‌డబ్ల్యూఓలకు తలనొప్పిగా మారింది.

మార్చి నుంచి అందని బిల్లులు
పాత తేదీ బిల్లుల ప్రకారం (జూలై 1వ తేదీకి ముందు) ఒక విద్యార్థికి 3 నుంచి 8వ తరగతి వరకు ఒక నెలకు రూ.750 ప్రకారం మెనులో భాగంగా చెల్లించేవారు. అలాగే 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు రూ.850 కేటాయించారు. గడిచిన జూలై 1వ తేదీ నుంచి కొత్త డైట్‌ బిల్లులు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ఒక నెలకు 3, 4వ తరగతి విద్యార్థులకు రూ.1,000, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,200 చొప్పున చెల్లిస్తున్నారు. మెనూలో భాగంగా ఒకవారంలో బియ్యంతో కలిపి మొత్తం 23రకాల నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి, విద్యార్థులకు వడ్డించాలి. ఈ మెనూలో చేసిన మార్పుల కారణంగా విద్యార్థులకు ప్రధానంగా ఒక వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం చికెన్‌ కూరను వడ్డించాలి. అంతవరకు బాగానే ఉంది. సాధారణంగా విద్యార్థులకు మెనూను సక్రమంగా అమలుచేయాలంటే క్రమంతప్పకుండా బిల్లులు అందాలి. అలా అందినప్పుడు పౌష్టికాహరం సక్రమంగా అందుతుంది. అయితే గడిచిన మార్చి నుంచి నేటి వరకు డైట్‌ బిల్లులు హెచ్‌డబ్ల్యూఓలకు అందలేదు. విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా హెచ్‌డబ్ల్యూలకు బిల్లులు అందుతాయి. కొందరికి మాత్రమే మార్చిలో బిల్లులందాయి. చాలామందికి ఏప్రిల్‌ నెల నుంచి బిల్లులు అందాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఒక హాస్టల్‌లో 100మంది విద్యార్థులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక హస్టల్‌లో 50 మంది విద్యార్థులు ఉన్నారనుకుంటే, ఒక నెలకు ఆ హాస్టల్‌ హెచ్‌డబ్ల్యూఓకు దాదాపు రూ.50 వేలకుపైగానే రావాలి. రాయచోటి, పులివెందుల తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఉంది. కొన్ని హాస్టళ్లలో 150మందికిపైగా ఉంటున్నారు. ఇలాంటి చోట ఒక నెలకు రూ.లక్షకు పైగా బిల్లు రావాల్సి ఉంటుంది.

సీఎఫ్‌ఎంఎస్‌ విధానం కారణంగా...
బిల్లుల చెల్లింపులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్స్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం)ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నూతన విధానం కారణంగా మెనూకు సంబంధించిన ప్రతి బిల్లును సీఎఫ్‌ఎంఎస్‌ ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ఇది కష్టతరంగా మారింది. విజయవాడ స్థాయిలోనే ఈ నూతన విధానం పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో తిప్పలు తప్పడంలేదు. దీంతో హెచ్‌డబ్ల్యూఓలకు బిల్లులు పాస్‌ కావడం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు రూ.2.78కోట్లకుపైగా డైట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

మూడు చికెన్‌ ముక్కలు..ఆరు గెరిటల పులుసు...!
దాదాపు 1987 వరకు హాస్టళ్లలో ఆదివారం మధ్యాహ్నం మాంసంను వడ్డించేవారు. ఒక కిలో మాంసంను 10మంది విద్యార్థులకు పెట్టేవారు. ఈ మాంసం వంటకం కారణంగా అప్పుడు హాస్టల్‌ సిబ్బంది వంటగదిని బార్లుగా మార్చారు. దీనికి తోడు పిల్లలకు సరిగా ముక్కలు పడేవి కావు. తదితర ఆరోపణలు కారణంగా నాడు మెనూ నుంచి మాంసంను తీసి వేశారు. దీనిపై విమర్శలు వచ్చాయి. పిల్లలకు బలమైన పౌష్టికాహారం అందడం లేదని ఆరోపణలు వచ్చాయి. మరి కొన్నాళ్లకు కొద్దిరోజుల పాటు చికెన్‌ను వడ్డించారు. కొద్దిరోజులకే అది కూడా మెనూ నుంచి వైదొలగింది. తాజాగా ప్రభుత్వం చికెన్‌ను తీసుకొచ్చింది. కాగా ఒక కిలో చికెన్‌ను ఎంతమంది విద్యార్థులకు వడ్డించాలనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు.

మెనూలో మాత్రం ఒక విద్యార్థికి ఒకసారికి 80 గ్రాములను వడ్డించాలని ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని హెచ్‌డబ్ల్యూఓలు అంటున్నారు. సాధారణంగానే మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త మెనూలోని ‘కోడి కూర’కు బిల్లుల గండం ఎదురైంది. కొంతమంది హెచ్‌డబ్ల్యూఓలు అప్పులు చేసి చికెన్‌తో పాటు ఇతర ఆహారాన్ని అందిస్తున్నారు. మరి కొంతమంది మూడు చికెన్‌ ముక్కలు..ఆరు గెరిటెల పులుసు అనే తరహాలో సర్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్లులు పాస్‌ కాని కారణంగా చాలామంది హెచ్‌డబ్ల్యూఓలకు సరుకులు సరఫరా చేసే దుకాణదారులే అప్పు ఇచ్చి ఆదుకుంటున్నారు. మొత్తం మీద బిల్లులు అందకపోవడంతో అప్పు చేసి పప్పుకూడును అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో మెనులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బడ్జెట్‌ ఉంది..
డైట్‌ బిల్లులకు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కొత్త విధానం కారణంగా బిల్లులు పాస్‌ కావడంలో కాస్త జాప్యం జరుగుతోంది. కొంతమందికి రెండు నెలల బిల్లులు మాత్రమే అందాల్సి ఉంది. మా హెచ్‌డబ్ల్యూఓలు మెనూను సక్రమంగా అమలుచేస్తున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటు పడుతున్నారు.          –సరస్వతి, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ

>
మరిన్ని వార్తలు