భోజనం 'మంట'

14 Dec, 2018 08:34 IST|Sakshi
భోజన నిర్వాహకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

మధ్యాహ్నభోజనం సరఫరాలో ఉద్రిక్తత

భోజనం సరఫరా వాహనాలను అడ్డుకున్న  ఎండీఎం నిర్వాహకులు

అరెస్టు చేసిన పోలీసులు

తొలిరోజు పలు పాఠశాలలకు చేరని ‘భోజనం’

ఆకలితో అలమటించిన విద్యార్థులు

విజయనగరం, నెల్లిమర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ అంశం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రైవేటు ఏజెన్సీల నుంచి సరఫరా చేసే భోజనాలను పాఠశాలల్లో పనిచేసే వంట నిర్వాహకులు గురువారం అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. దీంతో చాలా పాఠశాలలకు సకాలం లో ‘భోజనం’ చేరలేదు. విద్యార్థులు ఆకలితో అలమటిం చారు. నెల్లిమర్ల పట్టణంలో భోజన నిర్వాహకులు, వామపక్షాల నేతలకు పోలీసుల మధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేసి గుర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

ఇదీ పరిస్థితి...
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ప్రభుత్వం నవ ప్రయాస్‌ అనే సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు నెల్లిమర్ల, డెంకాడ, విజయనగరం మండలంలోని పలు పాఠశాలలకుభోజనం సరఫరా చేసే ప్రక్రియను సదరు సంస్థ గురువారం నుంచి ప్రారంభించింది. దీంతో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మూడు మండలాలకు చెందిన ఎండీఎం నిర్వాహకులు నెల్లిమర్లలోని నవ ప్రయాస్‌ సంస్థకు చెందిన భోజన సరఫరా కేంద్రానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పాఠశాలలకు భోజనాలను సరఫరా చేస్తున్న వాహనాలను అడ్డగించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

సీఐ రమేష్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు నారాయణరావు, రవి, రామకృష్ణ తదితరులు ఆందోళనను చెదరగొట్టాలని ప్రయత్నించారు. భోజనం తీసుకెళ్తున్న వాహనాలను విడిచిపెట్టాలని నిర్వాహకులను ఆదేశిం చారు. అయితే, మధ్యాహ్న భోజన ప్రక్రియ ప్రైవేటీకరణను రద్దుచేస్తామని కలెక్టర్‌ వచ్చి హామీ ఇస్తేనే వదులుతామని నిర్వాహకులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు టీవీ రమణ, బుతగ ఆశోక్, కృష్ణంరాజు, జీవా, కిల్లంపల్లి రామారావు, అప్పలరాజు దొర, ఎండీఎం నిర్వాహక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి తదితరులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీనిని మహిళలు అడ్డుకున్నారు. దీంతో నిర్వాహకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వెనక్కు తగ్గిన పోలీసులు కొద్దిసేపటి తరువాత ఒక్కరొక్కరుగా నేతలను, ఎండీఎం నిర్వాహకులను అరెస్టుచేశారు. వారిని గుర్ల, విజయనగరం పోలీసు స్టేషన్లకు తరలించారు.

విద్యార్థులకు ‘పస్తులు’
మధ్యాహ్న భోజనం సరఫరా తొలిరోజు అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. పాఠశాలలకు భోజనం సరఫరా లో నిర్వాహక ఏజెన్సీ సరైన ప్రణాళిక పాటించకపోవడంతో నెల్లిమర్ల పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలలకు భోజనం చేరలేదు. దీంతో వందలాదిమంది విద్యార్థులు భోజనాల్లేక పస్తులున్నారు. ఆహారం అందకపోవడంతో ఆకలితో విలవిలలాడిపోయారు. నెల్లిమర్ల పట్టణ పరిధిలోని గాంధీనగర్‌ కాలనీలోనున్న ప్రాథమిక పాఠశాలతో పాటు జ్యూట్‌మిల్లు స్కూల్‌కు భోజనాలు చేరలేదు. అలాగే, కొండపేట, రామతీర్థం జంక్షన్‌లోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు భోజనం కరువైంది. ఎంఈఓ అంబళ్ల కృష్ణారావు పాఠశాలలకు చేరుకుని చిన్నారులకు బిస్కె ట్‌ ప్యాకెట్లు అందించారు. అందుబాటులో ఉన్న విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఇదిలా ఉంటే తొలిరోజు విద్యార్థులకు వడ్డించిన అన్నం గట్టిగా ఉందని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తెలిపారు. ఉదయం 7గంటలకే వండటం వల్లనో, సరిగ్గా ఉడక్కపోవడం వల్లనో గట్టిగా ఉందని తెలిపారు.

అరెస్టులు దారుణం
గుర్ల:  ఏళ్ల తరబడి పనిచేస్తున్న భోజన నిర్వాహకులకు ఎలాంటి ఉపాధి చూపకుండా, జీవన భద్రత కల్పించకుండా పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడాన్ని నిర్వాహకులతో పాటు వామపక్షాల నాయకులు తప్పుబట్టారు. గుర్ల పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వేలాది మంది మహిళలకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని ఆరెస్టు చేయడం దారుణమని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని హెచ్చరించారు. అరెస్టైయిన వారిలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్, టి.జీవన్న, తమ్మి అప్పలరాజు దొర, పెంకి లక్ష్మి, ఉంగరాల జయలక్ష్మితో పాటు 200 మంది మధ్యాహ్న భోజన పథక నిర్వహకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు