దళారుల రాజ్యం

30 Jan, 2014 02:19 IST|Sakshi

కళ్యాణదుర్గం/అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వేరుశనగ కొనుగోలు కేంద్రంలో దళారులను నియంత్రించాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం మార్కెట్ యార్డు ప్రధాన గేటు ఎదుట బైఠాయించి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ఈ నెల 23వ తేదీన రైతులు వేరుశనగ బస్తాలు తీసుకు వస్తే ఇప్పటి వరకు తూకం వేయలేదని ఆరోపించారు. దళారులు మాత్రం అమ్ముకుంటున్నారన్నారు. కేంద్రాన్ని ఈ నెల 31న మూసివేస్తున్నారని, రెండు రోజుల్లో వేరుశనగ కాయలను ఎలా అమ్ముకోవాలో అర్థం కావడం లేదని రైతులు మండిపడ్డారు. మార్కెట్ యార్డులో పని చేసే సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సిబ్బంది, దళారులు కుమ్మక్కు అయ్యారని, ఇలా అయితే రైతులకు ఎలా న్యాయం జరుగుతుందని నిలదీశారు. ఇది ఇలాగే కొనసాగితే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. రోజూ ఎంత మంది రైతులు వేరుశనగ కాయలను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారో.. ఎన్ని క్వింటాళ్లు తూకం వేశారో ఏరోజుకారోజు మైక్ ద్వారా వివరించాలని కోరారు. దీనికి అధికారులు అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించారు.
 
 ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మార్కెట్ రామన్న, కాంగ్రెస్ నాయకులు బాలనరేంద్రబాబు, డీఎన్ మూర్తి, రాధాస్వామి, మల్లికార్జునబాబు పాల్గొన్నారు.


 కాటాలు, కౌంటర్ల సంఖ్య పెంచాలి వేరుశనగ కాయలను అమ్ముకోవడానికి పెద్ద ఎత్తున రైతులు వస్తుంటే అందుకు అనుగుణంగా కాటాలు, కౌంటర్లు పెంచకుండా వారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. బుధవారం అనంతపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని వేరుశనగ కొనుగోలు కేంద్రం వద్ద సీపీఐ నేతలు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అనంతరం రైతుల అవస్థలపై ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఏకాంబరరాజును నిలదీశారు.
 
 రైతులు నాలుగైదు రోజులుగా రేయింబవళ్లు అవస్థలు పడుతుంటే టోకెన్లు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మంచిదికాదని మండిపడ్డారు. వేరుశనగ కొనుగోలు కేంద్రాలను మార్చి 31వ తేదీ వరకు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు