ఆర్‌యూలో అర్ధరాత్రి అలజడి

7 Mar, 2018 11:30 IST|Sakshi
అతిథి గృహంలో చల్లాచెదురైన ఫర్నీచర్‌

వర్సిటీ అతిథి గృహంపై పూర్వ విద్యార్థుల దాడి  

రిజిస్ట్రార్‌ వాహనం, అతిథిగృహం ఫర్నీచర్‌ ధ్వంసం  

కర్నూలు (గాయత్రీ ఎస్టేట్‌): రాయలసీమ విశ్వవిద్యాలయంలో సోమవారం అర్ధరాత్రి అలజడి చెలరేగింది. వర్సిటీ పూర్వ విద్యార్థులు పూటుగా మద్యం సేవించి విశ్వవిద్యాలయం అతిథి గృహంపై దాడి చేశారు. వివరాలిలా ఉన్నాయి.. వర్సిటీ పరిశోధక విద్యార్థులు మద్దిలేటి, భాస్కర్, సూర్యప్రకాష్, గురుస్వామి పూటుగా మద్యం సేవించి సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో వర్సిటీ అతిథి గృహంలోకి వెళ్లి రిజిస్ట్రార్‌ బస చేసే గదిలోని ఫర్నీచర్, అతని వాహనాన్ని ధ్వంసం చేశారు. రిజిస్ట్రార్‌ కోసం అతిథి గృహంలోని గదులన్నీ వెతికారు. ఒక గదిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి సుధాకర్‌ ఉండగా అతణ్ని బెదిరించారు. తమకు వీసీ, రిజిస్ట్రార్‌ ఇద్దరు టార్గెట్‌ అంటూ కేకలు వేసుకుంటూ వెళ్లారని సుధాకర్‌ తెలిపారు. అతిథిగృహంలో శబ్ధం రావటంతో కొందరు సెక్యూరిటీ గార్డులు వారిని వెంబడించారు. నలుగురిలో ముగ్గురు దొరకగా వారిని పోలీసులకు అప్పగించారు. 

విద్యార్థులపై కేసు నమోదు
వర్సిటీలో  ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన భాస్కర్, రాఘవేంద్ర, మద్దిలేటి మరికొందరు విద్యార్థులపై రిజిస్ట్రార్‌ ఆచార్య అమర్‌నాథ్‌ ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా పోలీస్‌స్టేషన్‌ సీఐ ఇస్మాయిల్‌ కేసు నమోదు చేశారు.  

వర్సిటీ ఆస్తులకు నష్టం కలిగిస్తే చర్యలు     
విద్యార్థులు ఎవరైనా సరే వర్సిటీ ఆస్తులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేసిన పీడీఎఫ్‌ విద్యార్థులను గుర్తించాం. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా వారి ఉపకార వేతనాలు నిలిపేయాలని సంబంధిత ఫండింగ్‌ సంస్థలకు నివేదిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – వై.నరసింహులు, వీసీవర్సిటీ

మరిన్ని వార్తలు