క్వారంటైన్‌ కేంద్రాల నుంచి విముక్తి 

6 Apr, 2020 09:16 IST|Sakshi
కంభం, గిద్దలూరులలో క్వారంటైన్‌లో ఉన్న వారిని వారి స్వగ్రామాలకు పంపిస్తున్న అధికారులు  

పలువురిని స్వగ్రామాలకు పంపిన అధికారులు  

సాక్షి, గిద్దలూరు: క్వారంటైన్‌లో ఉన్న వారికి వైద్య పరీక్షల అనంతరం, వారికి ఎటువంటి లక్షణాలు లేవని నిర్ధారించి వారిని వారి వారి స్వగృహాలకు అధికారులు పంపించేస్తున్నారు. గిద్దలూరు పట్టణంలోని రాయల్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న క్వారంటైన్‌లో ఉన్న 156మంది వలస కూలీలను అధికారులు ఆదివారం వారి స్వగ్రామాలకు పంపించారు. జిల్లాలోని చీరాల, కందుకూరు ప్రాంతాలకు చెందిన పలువురు మత్స్యకారులు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు ప్రాంతంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

లాక్‌ డౌన్‌తో వారిని స్థానిక రాయల్‌ స్కూల్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. గత ఏడు రోజుల పాటు ఎమ్మెల్యే రాంబాబు ఆధ్వర్యంలో దాతలు భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎమ్మెల్యే తన సొంత వాహనాలతో వారిని స్వగ్రామాలకు పంపించారు. డీఎఫ్‌వో జి.సతీష్‌, తహసీల్దార్‌ పి.విద్యాసాగరుడు, డాక్టర్‌ మస్తాన్‌వలి, తదితరులు పాల్గొన్నారు.   

కంభం నుంచి 79 మంది స్వగ్రామాలకు.. 
కంభం: స్థానిక ఎస్వీకేపీ పాలిటెక్నికల్‌ కళాశాలలోని క్వారంటైన్‌లో ఉన్న 79 మందిని శనివారం రాత్రి వారి సొంత గ్రామాలకు పంపించారు.  వైద్య పరీక్షల అనంతరం వారికి ఎటువంటి లక్షణాలు లేవని నిర్ధారించినట్లు తెలిపారు. సొంత గ్రామానికి వెళ్లిన తర్వాత 22రోజుల వరకు హౌస్‌ క్వారంటైన్‌లోనే ఉండాలని అధికారులు వారికి సూచించారు. అలా కాకుండా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.  

మద్దిపాడు నుంచి 22 మంది.. 
మద్దిపాడు: మద్దిపాడు రూరల్‌ హెల్త్‌సెంటర్‌ క్వారంటైన్‌లో ఉన్న వారిని ఆదివారం విడుదల చేశారు. మొత్తం 26 మంది క్వారంటైన్‌లో ఉండగా, 22 మందిని ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. వీరిలో ఇద్దరు వేటపాలెంకు చెందిన వారు కాగా ఒకరు కందుకూరు, మరొకరు ఒంగోలుకు చెందిన వారు. వీరి నలుగురిని చీరాల నుంచి తీసుకు వచ్చి క్వారంటైన్‌లో ఉంచారు. విశాఖ పట్టణంలో దివి ల్యాబ్స్‌లో పని చేస్తూ సెలవుపై వచ్చిన ఎనిమిది మందిలో కరోనా లక్షణాలు లేకపోవడంతో వీరిని కూడా విడుదల చేశారు.

ఇక బెంగుళూరులో బేల్దారి పనులు చేస్తూ తిరుగు ప్రయాణంలో ఒంగోలు వద్ద పోలీసులు పట్టుకున్న ఏడుగురిలో కూడా కరోనా లక్షణాలు లేకపోవడంతో వీరిని విడుదల చేశారు. కాగా రాచపూడి, చీమకుర్తి, మర్రిపూడి గ్రామాలకు చెందిన ఒక్కొక్కరిని క్వారంటైన్‌ నుంచి విడుదల చేశారు. విడుదలైన వారు ఈ నెల 21వ తేదీ వరకు హౌస్‌ ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తిని మద్దిపాడు క్వారంటైన్‌ నుంచి ఒంగోలు రిమ్స్‌కు పరీక్షల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం మద్దిపాడు క్వారంటైన్‌లో ఒంగోలుకు చెందిన ఇద్దరు దంపతులు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు.

మలినేనిలో క్వారంటైన్‌ సెంటర్‌ మూసివేత 
సింగరాయకొండ: మలినేని ఇంజినీరింగ్‌ కాలేజీలోని రెండు క్వారంటైన్‌ సెంటర్‌లలో ఒక దానిని ఆదివారం అధికారులు మూసి వేసారు. లేడీస్‌ హాస్టల్‌లోని సెంటర్‌లో ఉన్న 96 మందిని ఇళ్లకు పంపించి 14 రోజుల పాటు ఇంటిలోనే ఉండాలని సూచించారు. రెండో సెంటర్‌లో 88 మంది ఉండగా, వారిలో 50 మందిని ఇళ్లకు పంపించారు. మిగిలిన వారిలో 33 మంది తూర్పు గోదావరి జిల్లా తుని, ఐదుగురు ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన వారున్నారని అధికారులు తెలిపారు.  

ఒకే కుటుంబంలో నలుగురికి..
కారంచేడు: మండలంలోని కుంకలమర్రు గ్రామం నుంచి ఢిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన గ్రామానికి చెందిన 32 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్‌ సోకిందని తెలిసిన వెంటనే గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతని భార్యను, కుమారుడు, కుమార్తెను కూడా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా భార్యకు పాజిటివ్‌ వచ్చింది. కుమారుడు, కుమార్తెలు మాత్రం వైరస్‌ బారిన పడకుండా తప్పించుకున్నారు.

ఇక ఆదివారం బాధితుని తల్లిదండ్రులకు కూడా వైరస్‌ సోకినట్లు రిపోర్టులు నిర్ధారించాయి. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా బాధిత కుటుంబాలకు చెందిన మరో 14 మందితో పాటు, మరో ఏడుగురు గ్రామస్తులు కూడా చీరాల, ఒంగోలు క్వారంటైన్‌లలో ఉన్నారు. మండల శాఖ అధికారులు కుంకలమర్రులోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు