మిల్లర్లకు గేట్లు బార్లా..!

4 Dec, 2014 02:01 IST|Sakshi
మిల్లర్లకు గేట్లు బార్లా..!

 శ్రీకాకుళం అగ్రికల్చర్, వీరఘట్టం:ఎఫ్‌సీఐ(భారత ఆహార సంస్థ) గేట్లు బార్లా తెరిచేసింది. బియ్యాన్ని ఎక్కడికైనా.. ఎప్పుడైనా రవాణా చేసుకొని నచ్చిన రేటుకు అమ్ముకునే స్వేచ్ఛ మిల్లర్లకు కల్పించింది. ఈ కొత్త నిర్ణయం కారణంగా మిల్లర్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు గండి పడనుం ది. వినియోగదారులపైనా భారం పడుతుంది. భారత ఆహార సంస్థ గతంలో మిల్లర్ల నుంచి 75 శాతం లేవీ సేకరించేది. మిగిలిన 25 శాతం బియ్యాన్ని రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేందుకు వీలుగా పర్మిట్లు మంజూరు చేసేది. దీని వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించేది. అయితే, ఈ ఏడాది లేవీ నిబంధనలను మార్చిన విషయం తెలిసిందే.
 
 దీని ప్రకారం మిల్లర్ల నుంచి 25 శాతం బియ్యాన్నే లేవీగా తీసుకుంటుంది. మిగిలిన 75 శాతం బియ్యాన్ని మిల్ల ర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సి ఉంటుం ది. ఇంత బియ్యం తామెక్కడ అమ్ముకోగలమని మిల్లర్లు గగ్గోలు పెట్టారు. దీంతో ఎఫ్‌సీఐ వెసులుబాటు పేరుతో వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. లెవీ చెల్లించగా మిగిలిన 75 శాతం బియ్యాన్ని రాష్ట్రం లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముకోవచ్చని, ఇందుకు పర్మిట్లు అవసరం లేదని స్పష్టం చేసింది. ఏ రైతు వద్ద ఎంత కొనుగోలు చేశారు, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి తరలిస్తున్నారన్నది మాత్రం తెలియజేసి రికార్డుల్లో పొందుపరిస్తే చాలనేది కొత్త నిబంధనల సారాంశం. పూర్తి స్వేచ్ఛ లభించడంతో మిల్లర్లు నాణ్యమైన బియ్యమే ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నిస్తారని, దీనివల్ల జిల్లాలో డిమాండ్ ఏర్పడి బియ్యం ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 నాణ్యమైన బియ్యానికి గిరాకీ
 తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నాణ్యమైన బియ్యానికి గిరాకీ ఉంది. దీంతో ఇక్కడ పండే నాణ్యమైన బియ్యం గతంలో 25 శాతం మాత్రమే అధికారికంగా వెళుతున్నా.. అనధికారికంగా మరెంతో వెళుతుండేది. ఇప్పుడు కేంద్రం బియ్యం  స్వేచ్ఛ కల్పించడంతో నాణ్యమైన బియ్యం భారీగా తరలిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ రకం బియ్యం కిలో ధర రూ. 40కి మించి ఉంది. అదే సమయంలో సాధారణ రకాలకు డిమాండ్ తగ్గి రైతులకు గిట్టుబాబు ధర దక్కె అవకాశాలు తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
 రైతులకు మద్దతు కరువు
 కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతులకు మద్దతు ధర లభించడం గగనమవుతోంది. ఎఫ్‌సీఐ 25 శాతమే తీసుకుంటే మిగిలిన 75 శాతం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడం కష్టమని, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇస్తే తాము నష్టపోతామని మిల్లర్లు బహిరంగంగానే చెబుతున్నారు.
 
 పక్క రాష్ట్రాల్లో కూడా వరి పంట బాగా పండుతోందని, అక్కడ మన బియ్యానికి అంత డిమాండ్ లేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వరి రైతులకు సాగు ఖర్చులు కూ డా రాని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.1,400 మద్దతు ధర ప్రకటించగా.. ఆ ధాన్యం ఉత్పత్తికి రైతులకు రూ.1700 వరకు వ్యయమవుతోంది. ఇది ప్రభుత్వం వేసిన లెక్కే. దీని ప్రకారం చూస్తే రైతులు ఒక్కో క్విం టాలు వద్ద రూ.300 నష్టపోతున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 3.5 కోట్ల క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు. దీని ప్రకారం రైతులు రూ.630 కోట్ల పెట్టుబడిని నష్టపోతున్నారు.ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మిల్లర్లు ధాన్యం కొన్నప్పుడే ఇంత నష్టం వాటిల్లితే.. ఇక మద్దతు ధర ఇవ్వని పరిస్థితుల్లో ఇంకెంత నష్టం వాటిల్లుతుందో తలచుకుంటనే భయమేస్తోందని రైతు లు అంటున్నారు. తుపానుతో కుదేల య్యామని, ఇప్పుడు ప్రభుత్వ విధానం తో నష్టం తప్పదని వాపోతున్నారు.
 

మరిన్ని వార్తలు