ఏటా కోటి మొక్కలు

7 Sep, 2014 01:19 IST|Sakshi
ఏటా కోటి మొక్కలు

 ఏలూరు : జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద మొక్క లు నాటేందుకు డ్వామా, సామాజిక అటవీ విభాగాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ కార్యక్రమం కింద ఏటా కోటి మొక్కలు నాటాలని నిర్ణయించాయి. ప్రభుత్వ కార్యాలయూలు, ఇరిగేషన్ స్థలాలు, ప్రైవేటు స్థలాలతోపాటు ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే సామాజిక వన విభాగం ఏటా 50 లక్షల మొక్కలను పాఠశాలలు, ప్రభుత్వ కార్యాల యూలు, వివిధ సంస్థలకు పంపిణీ చేస్తోంది. ఇకపై ఏటా కోటి మొక్కలు నాటించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. అయితే, మన జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే అడవులున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఏటా కోటి మొక్కల్ని నాటడం ద్వారా ఈ విస్తీర్ణాన్ని పెంచాలనే లక్ష్యంతో ఉన్నారు.
 
 ఐదేళ్ల ప్రణాళిక
 జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద 2015 నుంచి ఐదేళ్లపాటు పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు నిర్ణయించామని సామాజిక వనవిభాగం అధికారి ఎం.శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో నీడనిచ్చే మొక్కలు, చిన్నపాటి కలపనిచ్చే మొక్కలు నాటిస్తామన్నారు. రైతులకు సంబంధించిన స్థలాల్లో యూకలిప్టస్, సముద్ర తీరం, డెల్టా ప్రాంతాల్లో సరుగుడు మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. మొక్కలు నాటేం దుకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం సేకరిస్తున్నామని వివరించారు.

 

మరిన్ని వార్తలు