నిషేధిత భూములపై నాన్చుడే!

24 Jun, 2018 04:34 IST|Sakshi

1954కు ముందు‘డి’ పట్టాలపై సర్కారు ద్వంద్వ వైఖరి

సీసీఎల్‌ఏ నాలుగు లేఖలు రాసినా తేల్చని సర్కారు

రెవెన్యూ ప్రతిపాదనను పక్కన పెట్టిన కేబినెట్‌

సీఆర్‌డీఏ పరిధిలో మాత్రం నిషేధిత జాబితా నుంచి తొలగింపు

మంత్రులు, అధికార పార్టీ నేతలు రాజధానిలో అసైన్డ్‌ భూములు కొనటమే కారణం

సాక్షి, అమరావతి: రెవెన్యూ రికార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 1954కు ముందు పేదలకు ఇచ్చిన ‘డి’ పట్టా భూముల విషయంలో వివాదం ఇంతవరకు పరిష్కారం కాలేదు. వంశపారంపర్యంగా సంక్రమించిన వాటితోపాటు రిజిస్ట్రేషన్ల ద్వారా తాము కొనుగోలు చేసిన భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్‌ చట్టం ‘22–ఏ’ (నిషేధిత ఆస్తుల జాబితా)లో చేర్చారని లక్షల మంది భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసర సమయాల్లో అమ్ముకోవాలన్నా, తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలన్నా వీలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
తమ స్థిరాస్తులను ‘22–ఏ’ జాబితా నుంచి తొలగించాలంటూ అందిన లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో మూలుగుతున్నాయి. బాధితులు నిత్యం రెవెన్యూ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్లు దాటితే నేరుగా విక్రయించుకోవచ్చనే ఉత్తర్వులున్నా అవి కూడా ‘22 ఏ’ కింద చేరిపోవడంతో జీవో అమలు కావడం లేదు. రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉన్నతాధికారుల సమావేశంలో స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించడమే కాకుండా సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు నివారించాలని ఆదేశించారు.

తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్‌
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్న మీభూమి వెబ్‌ల్యాండ్‌లో వివరాలు తప్పుల తడకలుగా ఉన్నాయి. లక్షలాది సర్వే నంబర్లకు చెందిన భూముల వివరాలు ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. రెవెన్యూ శాఖ ప్రామాణికంగా చెబుతున్న రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌), రైతులకు సంబంధించిన భూ అనుభవ రిజిస్టర్‌ (అడంగళ్‌) మధ్య రాష్టవ్యాప్తంగా 16.47 లక్షల ఎకరాల విస్తీర్ణం తేడా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  ‘పట్టాదారు పాసు పుస్తకాల ప్రకారం వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే వాస్తవంగా ఉన్న భూమి కంటే 16.47 లక్షల ఎకరాలు ఎక్కువగా రికార్డు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అనేక చిక్కులు వస్తాయి. లేని భూమిని విక్రయించి సొమ్ము చేసుకునే వారూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే సబ్‌ డివిజన్‌ చేయాల్సిందే..’ అని భూ వ్యవహారాలపై బాగా అనుభవం ఉన్న ఒక జిల్లా కలెక్టరు చెప్పారు.

‘డి’ పట్టాలపై దాగుడుమూతలు
1954కు ముందు ప్రభుత్వం అసైన్‌మెంట్‌ కింద పేదలకు ఇచ్చిన ‘డి’ (డీకేటీ) పట్టాలను అసైనీలు అమ్ముకోవచ్చు. 1954 తర్వాత ఇచ్చిన ‘డి’ పట్టాలకు మాత్రం అనుభవ హక్కులు మాత్రమే ఉంటాయి. వాటిని హక్కుదారులు విక్రయించడానికి వీల్లేదని ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ (పీవోటీ) చట్టం స్పష్టంగా చెబుతోంది. అయితే రెవెన్యూ యంత్రాంగం 1954కు ముందు ఇచ్చిన ‘డి’ పట్టాలను కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చింది. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా ఇది సరి కాదని, 1954కు ముందు ఇచ్చిన డీకేటీ పట్టాలను 22–ఏ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇందుకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏ గత నాలుగేళ్లలో నాలుగు సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెవెన్యూ శాఖ ఒకసారి ఈ అంశాన్ని కేబినెట్‌ అజెండాగా కూడా చేర్చింది. అయితే కేబినెట్‌ ఏ నిర్ణయం తీసుకోకుండా తర్వాత చర్చిస్తామంటూ ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ సభల్లో డీకేటీ పట్టాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ప్రభుత్వం దీనిపై తేల్చకుండా కాలయాపన చేస్తుండటంతో అర్జీలన్నీ పెండింగ్‌లో పెట్టక తప్పదని కలెక్టర్లు తేటతెల్లం చేస్తున్నారు. 

పేదల గోడు పట్టదా?
1954కి ముందు డీకేటీ పట్టా భూముల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా ప్రభుత్వంఅమలు చేయడంలేదు. 1954కు ముందు ఇచ్చిన డీకేటీ భూములను పట్టా భూములుగానే పరిగణిస్తున్నట్లు సీఆర్‌డీఏ పరిధికి సంబంధించి పురపాలక శాఖ 2017 ఫిబ్రవరి 17వ తేదీన జీవో 41 జారీ చేసింది. ఈ జీవో ఆధారంగానే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు, నవులూరు గ్రామాల్లో ఈ తరహా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ గత నెల 18వ తేదీన జీవో 258 జారీ చేయడం గమనార్హం. సీఆర్‌డీఏ పరిధిలో అసైన్డ్‌ భూములను పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతలు కొనుగోలు చేయడంతో వారి పేరుతో ప్లాట్లు, కౌలు ఇచ్చేందుకే ప్రభుత్వం వీటిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తప్పించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేదలకు సంబంధించి ఇదే తరహా (1954కు ముందు ఇచ్చిన డీకేటీ పట్టా) భూములను మాత్రం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించకపోవడం గమనార్హం. ఇలా ప్రభుత్వమే ద్వంద్వ వైఖరి అనుసరిస్తే పేదల గోడు పట్టించుకునేదెవరని అధికారులు ప్రశ్నిస్తున్నారు. భూముల వ్యవహారంలో విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది రెవెన్యూ శాఖ కాగా పురపాలక శాఖ జీవోలు జారీ చేయడం ఏమిటని విస్తుపోతున్నారు. వీటిని సవాల్‌ చేయాల్సిన రెవెన్యూ శాఖ ఆ జీవోలనే ప్రామాణికంగా తీసుకుని మరో జీవో జారీ చేయడంపై అధికారులు మరింత విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

పక్షపాత వైఖరికి రుజువు
‘అందరికీ ఇదే తరహా జీవో వర్తింపజేస్తే ఇబ్బందులు ఉండవు. సీఆర్‌డీఏలో పెద్దలకు అనుకూలంగా జీవో ఇవ్వడం కోసం మాత్రం హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ మిగిలిన ప్రాంతాల్లో ఇదే తరహా భూములకు దీన్ని వర్తింపజేయకపోవడం ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనం’ అని రెవెన్యూ వ్యవహారాలపై అపార అనుభవం కలిగిన రిటైర్డు ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

  ‘రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. రెవెన్యూ రికార్డులన్నీ అప్‌డేట్‌ చేశాం. సమస్యలన్నీ పరిష్కరించాం. భూ రికార్డులను ఎవరైనా నేరుగా కంప్యూటర్‌లో ఇంటి నుంచే చూసుకునేలా మీభూమి వెబ్‌సైట్‌లో పొందుపరిచాం’
– తరచూ సీఎం ప్రకటనలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా