రికవర్రీ

20 Dec, 2013 02:15 IST|Sakshi

 =మిల్లులు, రైతులను వేధిస్తున్న సమస్య
 =గోవాడ, తాండవల్లో నామమాత్రంగా రికవరీ
 =పాతయంత్రాలు, అకాల వర్షాలతో కుదేలు
 =నష్టాలు దిశగా సుగర్ ఫ్యాక్టరీలు

 
చోడవరం, న్యూస్‌లైన్: మిల్లుల యాజమాన్యాలు, రైతులను ఏటా రికవరీ బెంగ వేధిస్తోంది. చెరకు పంట పక్వానికి వచ్చే దశలో తుపాన్లు, అకాల వర్షాలతో పాటు ఫ్యాక్టరీల్లోని పాతయంత్రాలు దెబ్బతీస్తున్నాయి. నాలుగేళ్లుగా ఇదే దుస్థితితో జిల్లాలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు ఆపసోపాలు పడుతున్నాయి. గతేడాది వరకు లాభాల్లో ఉన్న గోవాడ, లాభనష్టాలు లేకుండా నెట్టుకొస్తున్న ఏటికొప్పాక సయితం ఇప్పుడు అప్పుల ఊబిలోకి చిక్కుకునే దుస్థితి దాపురించింది. ఇప్పటికే తాండవ, అనకాపల్లి ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయి.

ఇందుకు ప్రధాన కారణం ఆయా ఫ్యాక్టరీల్లో ఉన్న పాతయంత్రాలే. బాయిలర్ హౌస్‌లు చిన్నవి కావడం, యంత్రాలను ఆధునికీకరించకపోవడంతో రికవరీ తగ్గిపోతోంది. దీనికితోడు పొలాల్లో తేమశాతం తగ్గకపోవడం కొంపముంచుతోంది. పంచదార నుంచి వచ్చే ఆదాయం కంటే ఉత్పత్తికి అయ్యే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల ఫ్యాక్టరీలు అదనంగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. క్రషింగ్‌కు ముందు రూ.కోట్లతో ఓవర్‌హాలింగ్ పనులు చేపడుతున్నప్పటికీ యంత్రాల్లో నాణ్యతలు లోపంతో యాజమాన్యాలు అనుకున్న ఉత్పత్తి సాధించలేకపోతున్నాయి.

క్రషింగ్‌కు ముందు ఏటా ప్రకృతి వైఫరీత్యాల కారణంగా మరికొంత నష్టం వాటిల్లుతోంది. పక్వానికి వచ్చిన చెరకు తోటల్లో నీరు నిల్వ ఉండిపోయి రస నాణ్యత తగ్గి రికవరీ పడిపోతోంది. గతేడాది గోవాడ సుగర్స్‌లో ఒక్కరోజు మాత్రమే అత్యధికంగా 12శాతం రాగా సీజన్ సరాసరి 9.4తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే టన్ను చెరకుకు క్వింటా కూడా పంచదార ఉత్పత్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది తొందరగా నవబంరులోనే గానుగాట ప్రారంభించాలని గోవాడతోపాటు అన్ని ఫ్యాక్టరీలు యోచించాయి.

గోవాడ, తాండవ ఫ్యాక్టరీలు డిసెంబరు మొదటివారంలోనే రెగ్యులర్ క్రషింగ్  ప్రారంభించాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షపు నీరు తోటల్లో ఉండటంతో రికవరీ కేవలం 7.88 మాత్రమే వస్తోంది. చలిఎక్కువగా ఉంటే రికవరీ బాగుంటుంది. అయితే తోటలు నీరు నిల్వతో చలి బాగా ఉన్నప్పటికీ రికవరీ మాత్రం ఆశించస్థాయిలో రావడం లేదు. ఏటికొప్పాక, అనకాపల్లి ఫ్యాక్టరీలు కూడా ఈ వారంలో క్రషింగ్‌కు సిద్ధమవుతున్నాయి.

కేంద్రం యోచన ఊరటనిస్తుందా!

అప్పుల్లో కూరుకుపోయిన సుగర్ ప్యాక్టరీలకు అతి తక్కువ వడ్డీతో రుణం ఇవ్వడానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాదన కొంత ఊరట కలిగించనుంది. చెరకు తీసుకు న్న 14 రోజుల్లో మిల్లుల యాజమాన్యాలు రైతులకు చెల్లిం పులు చేపట్టాలి. జిల్లాలోని ఏ ఫ్యాక్టరీ ఈ గడువును పాటిం చడం లేదు. తుమ్మపాల, తాండ ఫ్యాక్టరీలు గతేడాది సక్రమంగా చెల్లింపులు జరపలేదు. తుమ్మపాలు ఇప్పటికీ సు మారు రూ.63 లక్షలు రైతులకు చెల్లించాలి. కేంద్రం నేరుగా అప్పులు ఇచ్చి ఫ్యాక్టరీల అభివృద్ధికి తోడ్పడాలన్న ప్రతిపాదనతో నష్టాల్లో ఉన్న అనకాపల్లి, తాండవ వంటి ఫ్యాక్టరీల మేలు జరిగే అవకాశం ఉంది. రైతులకు సకాలంలో చెల్లింపులతోపాటు కొత్త యంత్రాలు ఏర్పాటుచేసుకొని మంచి రికవరీ సాధించడానికి దోహదపడుతుంది. గోవాడ, ఏటికొప్పాక ఆధునికీకరణ దిశగా పయనించే వీలుంటుంది.

మరిన్ని వార్తలు