గిరిజన ప్రాంతాల్లో లీజుల రద్దు

16 Oct, 2013 00:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు మంజూరు చేసిన మైనింగ్ లీజులను పునఃసమీక్షించి వాటన్నింటినీ వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి (ఏపీటీఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గిరిజన సంక్షేమ మంత్రి పసుపులేటి బాలరాజు నేతృత్వంలో మంగళవారం జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశానికి గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ఊకె అబ్బయ్య, కుంజా సత్యవతి, ధనసరి అనసూయ, రాజన్నదొర, సత్యనారాయణరెడ్డి, మిత్రసేన, నిమ్మక సుగ్రీవులు, నగేశ్ హాజరయ్యారు.
 
  గిరిజన ప్రాంతాల్లోని బాక్సైట్, లేటరైట్ మైనింగ్ లీజు లపై వాడివేడి చర్చ జరిగింది. అధికారులు గిరిజన హక్కులను కాలరాస్తూ.. లీజుల పేరిట భూములిచ్చి బినామీలు దోచుకునేందుకు దోహదపడుతున్నారని ఎమ్మెల్యేలు సక్కు, అబ్బయ్య, రాజన్నదొర ఆరోపించారు. లీజు కింద వస్తున్న రాయల్టీ ఎవరి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. లీజులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ స్వయంగా లేఖ రాశాక కూడా లీజుకు అనుమతి ఎందుకిచ్చారని నిలదీశారు. మైనింగ్ లీజులకు 5 కిలోమీటర్ల పరిధిలో గిరిజన ఆవాసాలే లేవని అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. ఖనిజాల తవ్వకాలకోసం బినామీలకు లీజుకివ్వకుండా స్థానిక గిరిజనులను ప్రోత్సహించి, వారితో పరిశ్రమలు పెట్టించి ఉపాధి కల్పించేలా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సభ్యులందరి ఏకగ్రీవ ఆమోదంతో గిరిజన ప్రాంతాల్లోని లీజుల న్నింటినీ రద్దు చేయాలని సమావేశం తీర్మానించింది.
 
 సబ్‌ప్లాన్ పనుల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం..
 ఎస్టీ ఉపప్రణాళిక చట్టం కాంట్రాక్టర్లకు చుట్టంగా మారిందని సభ్యులు ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పనుల ప్రతిపాదనలను పంపి వాటికి ఆమోదం తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి సబ్‌ప్లాన్ కింద చేపట్టే పనుల్లో స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారి సిఫారసు మేరకే పనుల ప్రతిపాదనలు రూపొందించాలంటూ తీర్మానించారు. ఇక ‘మందుల’ కులాన్ని ఎస్టీల జాబితా లో చేర్చాలనే అధికారుల ప్రతిపాదనను సమావేశం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ముందు ఎస్టీలలో ఉన్న గిరిజనుల జీవన పరిస్థితులు చక్కదిద్దాకే, కొత్త కులాలను చే ర్చే విషయం ఆలోచిద్దామని సభ్యులు చెప్పారు. సభ్యుల అభిప్రాయాలతో మంత్రి కూడా ఏకీభవించడంతో మందుల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అంగీకరించవద్దని, మున్ముందు ఇలాంటి ప్రతిపాదనలను ప్రోత్సహించవద్దని తీర్మానించారు. ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సుమన్‌రాథోడ్, తెల్లం బాలరాజును కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా టీఏసీ సమావేశాలకు అహ్వానించాలని తీర్మానించారు.
 
 గిరిజన హక్కులు కాలరాస్తున్నారు: బాలరాజు
 సమావేశానంతరం మంత్రి బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనుల భవిష్యత్తు తరాల ప్రయోజనాలదృష్ట్యా గిరిజన ప్రాంతాల్లోని మైనింగ్ లీజుల ను రద్దు చేయాలని తీరానించినట్లు చెప్పారు. రాష్ట్రం లో గిరిజన అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని, జీసీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గు ర్తించాలని, 800 గ్రామాలను షెడ్యూలు ఏరియాలో నోటిఫై చేయాలని కూడా తీర్మానించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు