మైనింగ్ పర్మిట్ల మాయాజాలంమైనింగ్ పర్మిట్ల మాయాజాలం

2 Jan, 2014 02:20 IST|Sakshi

=అనుమతికి మించి తరలింపు
 =ప్రభుత్వ ఆదాయానికి గండి
 =విజిలెన్స్ దాడులతో వెలుగులోకి

 
గనుల లీజులకు తిలోదకాలిస్తున్నారు. పర్మిట్ల మాయాజాలంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలోని పలు గనుల క్వారీల్లో ఈ తంతు యథేచ్ఛగా సాగిపోతున్నా సంబంధిత అధికారులు నియంత్రించలేకపోతున్నారు.  క్షేత్రస్థాయిలో నిఘా లేకపోవడంతో లీజుదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
 
సాక్షి, విశాఖపట్నం  :  క్వారీలు లీజుకిచ్చినప్పుడు నిర్దేశిత విస్తీర్ణంలో తవ్వకాలు జరపాలని మంజూరు పత్రంలో స్పష్టంగా ఉంటుంది. తవ్వకాలు జరిపిన గ్రావెల్, గ్రానైట్, ఖనిజాలను తీసుకున్న పర్మిట్ల మేరకే రవాణా చేయాలి. గ్రావెల్‌కైతే ఒకటి రెండు రోజులకు, స్టోన్స్/ ఖనిజాలకైతే నెలకోసారి భూగర్భ గనుల శాఖ నుంచి పర్మిట్లు తీసుకోవాలి. క్యూబిక్ మీటరు స్టోన్స్ పర్మిట్‌కు రూ.50లు, ఖనిజాలకు రూ.1875 నుంచి రూ.2400లు, మట్టికి రూ.22 లు చెల్లించి పర్మిట్లు తీసుకుని రవాణా చేయాలి.

ఇలా ప్రస్తుతం జిల్లాలోని విశాఖ ఏడీ పరిధిలో 143, అనకాపల్లి పరిధిలో 343 లీజులున్నాయి. రోడ్డు మెటల్, భవన నిర్మాణ రాయి, గ్రావెల్, కాల్షైట్, మైకా, బంకమట్టి, క్వార్ట్స్, లేటరైట్, లైమ్‌స్టోన్ తదితర ఖనిజాల తవ్వకాలు జరు గుతున్నాయి. అయితే తవ్వకా లు, రవాణా కొచ్చేసరికి పలువు రు లీజు యజమానులు అడ్డుగోలుగా వ్యవహరిస్తున్నారు. అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా తవ్వకాలు జరిపి తరలిస్తున్నారు. ఉదాహరణకు నెలకు 50 పర్మిట్లు తీసుకుంటే  200 పర్మిట్లకు పైగా ఖనిజాలను అక్రమంగా రవాణా చేస్తున్నారు.

సాధారణంగా 24 గంటల్లోగా ఒక పర్మిట్‌తో ఒక లోడును రవాణా చేయవచ్చు. ఇదే అవకాశంగా తీసుకుని అదే పర్మిట్‌తో రోజు కు నాలుగైదు లోడ్లు తరలించేస్తున్నారు. అదనం గా తరలించినదంతా లెక్కలోకి రావడం లేదు. ఫలితంగా వాటి ద్వారా రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది.  విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆకస్మిక తనిఖీల్లో ఇవన్నీ వెలుగు చూస్తున్నాయి. ప్రతీ నెలా సరాసరి ఈ తరహా  కేసులు 50కి పైగా పట్టుబడుతున్నాయి. దాదాపు రూ.10 లక్షల మేర అపరాధ రుసుం కింద వసూలవుతోంది.

దీనికంతటికీ క్షేత్రస్థాయి నిఘా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. క్వారీలో ఎప్పటికప్పుడు ఎంతమేరకు తవ్వకాలు జరుపుతున్నారో, రోజుకి ఎన్ని పర్మిట్లు వాడుతున్నారో పరిశీలించాలి. రవాణా చేస్తున్న వాటికి పర్మిట్లు ఉన్నాయో లేదో తనిఖీలు చేయాలి. గతంలో ఈ తరహా తనిఖీలు జరిగేవి. కానీ ఇప్పుడు జరగడం లేదు. లీజు వ్యవధి పూర్తయ్యే వరకు క్వారీల వద్ద తనిఖీలు చేసే అధికారం లేదని, పర్మిట్లను నిత్యం పరిశీలించే సమయం దొరకడం లేదంటూ మైనింగ్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీన్నే ఆవకాశంగా తీసుకుని పలువురు లీజుదారులు రెచ్చిపోతున్నారు.
 

మరిన్ని వార్తలు