మంత్రి మాటలతో మోసపోయాం

4 Oct, 2017 12:22 IST|Sakshi
రావివలస మెట్‌కోర్‌ పరిశ్రమ ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న కార్మికులు

రావివలస మెట్‌కోర్‌ పరిశ్రమ వద్ద కార్మికుల ఆందోళన

హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నిలదీత

బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌

పరిశ్రమను పూర్తి స్థాయిలో తెరవాలంటూ నినాదాలు

శ్రీకాకుళం, టెక్కలి: ‘పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించే విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాటలు విని మోసపోయాం.. పరిశ్రమ యాజమాన్యం మూడేళ్లుగా పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వడం లేదు.. పరిశ్రమను సక్రమంగా తెరవకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం..’ అంటూ టెక్కలి మండలం రావివలస మెట్‌కోర్‌ ఎల్లాయిస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఇనుము ఉత్పత్తి పరిశ్రమ) కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. దీంతో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడాదిగా ఒక్క రూపాయి కూడా వేతనం ఇవ్వకపోవడంతో సుమారు 200 మంది కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. బకాయి వేతనాల విషయంలో  పరిశ్రమ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రామారావు వైఖరిని నిరసిస్తూ కార్మికులంతా చుట్టుముట్టారు. తక్షణమే బకాయి వేతనాలు ఇవ్వాలని, పరిశ్రమను పూర్తి స్థాయిలో తెరిచి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ పరిశ్రమ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కార్మికుల యూనియన్‌ నాయకులు పి.గంగయ్య, బి.వి.రాజు, బి.నీలకంఠేశ్వరరావు, వై.గురయ్య, పి.గున్నయ్య, ఎం.అప్పారావు, పి.సీతారాం, ఎస్‌.గోవింద్, బోస్‌ తదితరులు మాట్లాడుతూ..  పరిశ్రమ నష్టాల్లో ఉందని కుంటిసాకులు చెబుతూ 2015 మే 22న లాకౌట్‌ ప్రకటించడంతో, అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పలుమార్లు పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరిపినట్లు తెలిపారు. అప్పటికే 6 నెలల బకాయి జీతాలతో పాటు 2014 నుంచి పీఎఫ్, గ్రాట్యూటీ, రన్నింగ్‌ బోనస్‌ చెల్లించలేదని చెప్పారు. వేతనాల్లో 60 శాతం కార్మికులకు చెల్లించేలా యాజమాన్యంతో చర్చించామని, పరిశ్రమను పూర్తి స్థాయిలో తెరిచేలా చర్యలు తీసుకుంటామని అప్పటి కార్మికమంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీలు నెరవేరలేదని, మంత్రి మాటలు నమ్మి మోసపోయామని కార్మికులంతా  వాపోయారు. దశాబ్దాలుగా ఈ పరిశ్రమను నమ్ముకున్న కార్మికులకు తక్షణ  న్యాయం జరగకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని వారంతా హెచ్చరించారు.

మరిన్ని వార్తలు