అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు: ఆదిమూలపు

21 Jun, 2019 19:47 IST|Sakshi
మంత్రి ఆదిమూలం సురేష్‌(పాత చిత్రం)

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పెంపు, ప్రహరీగోడలు, అదనపు తరగతి గదుల నిర్మాణంపై మంత్రి ఆదిమూలపు సురేష్‌, యూనివర్సిటీ వీసీలతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రెండు ఏళ్లలో ప్రభుత్వ బడుల ఆధునీకరణకు చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించామని తెలిపారు. మౌలిక వసతులు, అత్యాధునిక వసతులు అనే రెండు అంశాలుగా విభజించామని చెప్పారు. విద్యాశాఖలో ఇంజనీరింగ్‌ విభాగాల మధ్య సమన్వయ లోపం ఉందని అన్నారు. సమన్వయ లోపంతో పాఠశాలల్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, అన్ని విభాగాల్లోని ఇంజనీరింగ్‌ సిబ్బందిని ఏకతాటిపైకి తేవాలని నిర్ణయించామని తెలిపారు.

అమ్మ ఒడి పథకం తమకు వర్తింపజేయాలని ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రజలు కోరుతున్నట్లు వెల్లడించారు. అమ్మ ఒడి పథకం ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తింపజేయాలా వద్దా అనే విషయమై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు. అమ్మ ఒడి అమలుపై సీఎం వైఎస్‌ జగన్‌ త్వరలోనే స్పష్టత ఇస్తారని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు పైన సీఎం త్వరలోనే స్పష్టత ఇస్తారని అన్నారు.

మరిన్ని వార్తలు