డ్యాక్రా మహిళలకు చెక్కులు అందించిన మంత్రి, ఎమ్మెల్యేలు

24 Apr, 2020 19:28 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి నిజమైన మహిళల పక్షపాతి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులో వైఎస్సార్‌ సున్నా వడ్డి పథకం చెక్కులను డ్వాక్రా మహిళలకు మంత్రి శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబులా మాయమాటలు చెప్పకుండా పాదయాత్రలో ఇచ్చిన మాట  నిలబెట్టుకున్న గొప్ప నేత సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జేట్‌ ఉన్నప్పటికీ ప్రజలను ఆదుకోవాలనే మంచి మనసు ఉంది కాబట్టే ఇవ్వాళ పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అందిస్తున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. (కర్నూలులో సున్నా వడ్డి పథకాన్ని ప్రారంభించిన మంత్రి)

గుంటూరు: సీఎం జగన్‌ మాట తప్పడు.. మడమ తిప్పడని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి అన్నారు. మంగళగిరిలో వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా స్వయం సహాయక సంఘాలకు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

అనంతపురం: సంక్షోభ కాలంలోనూ సీఎం జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే సిద్దారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 11 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. కష్టకాలంలో డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు.

మరిన్ని వార్తలు