విద్యకు అధిక ప్రాధాన్యత: మంత్రి సురేష్‌

19 Oct, 2019 12:50 IST|Sakshi

సాక్షి, కడప: రాష్ట్ర చరిత్రలోనే విద్యాశాఖకు రూ.33వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నవంబర్‌ 14న ప్రారంభించనున్న 'మనబడి నాడు-నేడు' కార్యక్రమంపై శనివారం కడప జడ్పీ హాలులో విద్యాశాఖ ఇంజనీర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని అన్నారు. విద్యా శాఖకు  సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అమ్మఒడి, మనబడి నాడు-నేడు లాంటి వినూత్నమైన పథకాలను వైఎస్ జగన్ ప్రవేశ పెట్టారని వెల్లడించారు. అమ్మ ఒడి ద్వారా లక్షల మంది తల్లులకు లబ్ధి చేరుతుందని పేర్కొన్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి..
ప్రతి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను సమూలంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. విద్యాలయాలను ఆలయాలుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, కళాశాలలను త్వరితగతిన పునర్నిర్మాణం చేస్తామని వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

జూనియర్‌ కళాశాల ఆకస్మిక తనిఖీ..
కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలను మంత్రి ఆదిమూలపు​ సురేష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను విద్యార్థులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట జిల్లా విద్యాశాఖ అధికారులు, మాజీ మేయర్‌ సురేష్‌బాబు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు