అవినీతి బయటపడుతుందనే చంద్రబాబుకు వణుకు

29 Aug, 2019 09:52 IST|Sakshi

సాక్షి, లింగపాలెం(పశ్చిమగోదావరి) : మాజీ సీఎం చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ అక్రమాలు ఎక్కడ బయటపడి జైలుకు పోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ధర్మాజీగూడెం మార్కెట్‌ యార్డులో బుధవారం జరిగిన పార్టీ సీనియర్‌ నాయకుడు  మందలపు సత్యనారాయణ సన్మాన సభలో నాని ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌లో చేసిన అవినీతి బయటపడకుండా చంద్రబా బు, అతని అనుచరులు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ఆయన అనుచరులు ప్రాజెక్ట్‌ నిర్మాణంపైనా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనా అసత్య ఆరోపణలు  చేయటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు తిన్న వేల కోట్ల రూపాయలు కక్కించి ప్రజా సంక్షేమానికి, ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వెచ్చిస్తామని నాని పేర్కొన్నారు.  

గతంలో వరదలు వస్తే అప్పటి టీడీపీ నేతలు బాధితుల ఇబ్బందులు పట్టించుకునే వారే కాదని విమర్శించారు. ఇటీవల వరదలు వస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో లేకపోయినా వరద ప్రాంత ప్రజలను ఆదుకోవాలని మంత్రులను, ఎమ్మెల్యేలను ఆదేశించారని, నష్టపోయిన కుటుంబాలకు రూ.5 వేలు, నిత్యావసర వస్తువులు అందజేశామని చెప్పారు. విదేశం నుంచి వచ్చిన వెంటనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు అండగా నిలిచారని నాని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల్లో 80 శాతం మేర అమలు చేయటం ఆయన ఘనతని తెలిపారు.

ఆయన ప్రజలకు ఇచ్చిన మాట కోసం అహోరాత్రులు కష్టపడి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారని, ఆయనకు మనమందరం మద్దతుగా నిలవాలని సూచించారు. నవరత్నాలతో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరుగుతుందన్నారు. నిష్పక్షపాతంగా, అవినీతి లేకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు.   ప్రజలు ఓట్లు వేయలేదనే అక్కసుతో  ప్రభుత్వ పథకాలు వారికి చేరువకాకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని నాని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించటమే జగన్‌ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు వీఆర్‌ ఎలీజా, కొఠారు అబ్బయ్యచౌదరి, తలారి వెంకట్రావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు