యువతకు ఉపాధి కల్పిస్తాం: మంత్రి ఆళ్ల నాని

10 Jul, 2019 10:31 IST|Sakshi
నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుంటున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని  

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన స్థితిగతులు మెరుగుపరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఆళ్ల నాని తెలిపారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల  నుంచి వినతిపత్రాలను స్వీకరించడమే కాకుండా వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది యువకులు మంత్రిని కలిసి తమ జీవనోపాధికి ఉద్యోగాన్ని కల్పించాలని కోరగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టపరుస్తున్నారని, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున వలం టీర్ల ఉద్యోగాలు కల్పిస్తున్నారని, యువత వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపాధి సౌకర్యాలు కూడా కల్పిస్తుందని ఆయన చెప్పారు.

వివిధ వృత్తుల్లో స్థిరపడటానికి ఆధునిక సాంకేతిక శిక్షణ కూడా యువతకు అం దించి వారి వృత్తుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచుతామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందినప్పుడే తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయగలుగుతారని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యాబోధన అందించడానికి విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో యువత చదువుకునేలా ఆర్థిక ప్రోత్సాహం కూడా ప్రభుత్వం కల్పిస్తుందని.. ప్రతిఒక్కరూ తమ పిల్లలను చదివించడానికే ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప తాత్కాలిక ప్రయోజనాల కోసం షాపుల్లోనో, ఇతర సంస్థల్లో పనిచేయించవద్దని సూచించారు.

సమాజంలో ఆర్థిక ప్రగతి సాధించాలంటే ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాలని ప్రతి కుటుంబానికి ఆరోగ్యం కల్పించే విధంగా ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎక్కడైనా ప్రమాదం జరిగిన గర్భిణికి వైద్య సేవలు అందించడానికి అవసరమైన వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నెరుసు చిరంజీవి, ఎన్‌. సుధీర్‌బాబు, అంబికా రాజా, మధ్యాహ్నపు బలరాం, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు పాల్గొన్నారు. 

నర్సుల సమస్యలు పరిష్కరిస్తాం
రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న నర్సుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని చెప్పారు. నర్సుల అసోసియేషన్‌ నాయకులు మంత్రి నానిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందచేశారు. దీనిపై డిప్యూటీ సీఎం నాని స్పందిస్తూ నర్సులు అంకితభావంతో పనిచేయాలని ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలే తప్ప వారిపై విసుగు, కోపం చూపించకూడదని వచ్చిన ప్రతిఒక్కరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తే సగం వ్యాధి నయమైనట్లేనని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న ఆసుపత్రులలో వై ద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని నివేదిక రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి అన్ని ప్రభుత్వాసుపత్రులను ప్రక్షాళన చేస్తామని చెప్పారు.  ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి  చ ర్యలు తీసుకుంటున్నామని సిబ్బంది కూడా కష్టపడి పనిచేస్తే ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందన్నారు.

ప్రభుత్వపరంగా వైద్యరంగంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి ఎంతో చొరవ చూపుతున్నారని ఇందుకు నిదర్శనమే ఆశావర్కర్ల వేతనాల పెంపు అని మంత్రి అన్నారు. ప్రభుత్వాసుపత్రులలోనే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసిందని, ఈ ఉద్యోగులకు కూడా ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చడానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో సైనికుల్లా పనిచేయడానికి ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని, అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించి మళ్లీ ప్రజాభిమానాన్ని చూరగొంటామని మంత్రి నాని చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దిరిశాల వరప్రసాద్, మధ్యాహ్నపు బలరాం, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నెరుసు చిరంజీవి, ఎన్‌.సుధీర్‌బాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు