మానవత్వాన్ని చాటుకున్న మంత్రి

18 Sep, 2019 08:40 IST|Sakshi
క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తరలిస్తున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

క్షతగాత్రులను సొంత వాహనంలో ఆస్పత్రికి తరలింపు

ఏలూరు టౌన్‌/ఉంగుటూరు(గన్నవరం) : అమరావతిలోని సెక్రటేరియట్‌కు వెళుతున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన క్షతగాత్రులను చూసిన వెంటనే వాహనాన్ని నిలిపివేసి పరిస్థితిని ఆరా తీశారు. తన సొంత వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద మంగళవారం ఆటోను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో మానికొండకు చెందిన జి.నరసింహారావు, బండారుగూడెంకి చెందిన ఐ.రాధికకు తీవ్రగాయాలయ్యాయి. ఇరువురు తీవ్ర గాయాలతో రోడ్డుపై ఉండడాన్ని గమనించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తమ కాన్వాయ్‌ని ఆపి ఆయన కారులోనే క్షతగాత్రులను చినఅవుటపల్లిలోని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

మెరుగైన వైద్యం అందించాలని అక్కడి నుంచే సిద్ధార్థ ఆసుపత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఆళ్ల నాని తన విధులకు వెళుతూ ఈ విధంగా రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించి ఆసుపత్రికి తరలించడంపై క్షతగాత్రులతో పాటు అక్కడికి చేరిన ప్రజలు అభినందనలు తెలిపారు. కాగా, ఆత్కూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు