అత్యంత పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్‌

15 Sep, 2019 13:25 IST|Sakshi

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌..

సాక్షి, అమరావతి: పోలవరం రివర్స్‌ టెండరింగ్‌పై మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో వందల కోట్లు చేతులు మారాయని.. ఆనాడూ జరిగిన అవినీతిని రామోజీరావు తన పత్రికలో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 20 శాతం వరకు టెండర్లు వేస్తే ప్రజలకు, ప్రభుత్వానికి వందల కోట్ల మేలు జరిగే అవకాశం ఉంటుందనే సంగతి తెలిసి కూడా తప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారో రామోజీరావు సమాధానం చెప్పాలన్నారు.

రాష్ట్ర్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఆర్‌అండ్‌ఆర్‌ ఖర్చులు భరించడంతోపాటు, అనుమతులన్నీ సాధించి పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 31 నెలలు పోలవరం పనులు జరగకుండా మోకాలడ్డు పెట్టారన్నారు. చంద్రబాబు.. ప్రత్యేక హోదాను తాకట్టును పెట్టి పోలవరం  ప్రాజెక్టును తనకు ఇవ్వాల్సిందిగా 2016 సెప్టెంబర్‌ 8న అర్ధరాత్రి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. లంచాలు, కమీషన్లు ఇచ్చిన అస్మదీయులకు బాబు కాంట్రాక్టులు అప్పగించారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచి.. చంద్రబాబులా డబ్బు దోచుకునేవిధంగా కాకుండా.. ప్రాజెక్టు వ్యయం తగ్గించేవిధంగా దేశంలోనే తొలిసారిగా అత్యంత పారదర్శకంగా టెండర్లను పిలిచి రివర్స్‌ టెండరింగ్‌ను అమలు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు