తెలంగాణతో వివాదాలు కోరుకోవట్లేదు : అనిల్‌

6 Jun, 2020 14:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : పొరుగు రాష్ట్రం తెలంగాణతో తాము ఎలాంటి వివాదాలు, విభేదాలు కోరుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. తెలంగాణకు గోదావరి నీటిపై ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవని, దీనిపై గోదావరి యాజమాన్య బోర్డు నుంచి సరైన స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో వివాదం ఏర్పడిన నేపథ్యంలో శుక్రవారం గోదావరి బోర్డు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అన్నారు. (ముందుకెళ్లొద్దు: గోదావరి బోర్డు)

గోదావరితో పాటు కృష్ణా నదీ జలాల్లో తమకు రావాల్సిన నీటినే తాము వినియోగించుకుంటున్నామని మంత్రి అనిల్‌ కుమార్‌ వివరించారు. దానిలో భాగంగానే పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యం పెంచుతున్నామని తెలిపారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేసి తీరుతామని వెల్లడించారు. ఐదేళ్లపాటు పదవిలో ఉండి పోలవరం గురించి కనీసం ఆలోచన చేయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు దానిపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి  ప్రారంభించిన పోలవరాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

‘పోలవరం నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని అసమర్ధుడు చంద్రబాబు. వైఎస్ జగన్ పాలనకు మార్కులు వేసే సీన్ చంద్రబాబుకు లేదు. ఏడాది కాలంలోనే దేశంలో 4వ బెస్ట్ సీఎంగా వైఎస్ జగన్ నిలిచారు. చంద్రబాబు ఏనాడైనా టాప్ ‌5లో నిలిచారా?. లోకేష్ మొదటి షోకే వెనక్కి వెళ్లిపోయే ఫ్లాప్‌ సినిమా లాంటోడు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. సీఎం జగన్ బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలకు ఇన్ని పథకాలు చరిత్రలో ఏ సీఎం ప్రవేశపెట్టలేదు’ అని అన్నారు.


 

మరిన్ని వార్తలు