‘కడపలో బ్యాంక్‌ శాఖలను తగ్గించలేదు’

3 Mar, 2020 21:15 IST|Sakshi

న్యూఢిల్లీ : నీతి అయోగ్‌ ఎంపిక చేసిన ఆశావహ జిల్లాల్లో ఒకటైన కడపలో బ్యాంక్‌ శాఖలను తగ్గించలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. పలు రకాల ఆర్థిక సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసురావడం ఆశావహ జిల్లాల అభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రధాన అంశమని వివరించారు. 

ఎంపిక చేసిన ఆశావహ జిల్లాలో ప్రతి లక్షమందిలో ముద్ర రుణాలు పొందిన లబ్దిదారుల సంఖ్య, ప్రతి లక్ష మందిలో ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన కింద తెరిచిన ఖాతాలు, ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన్‌, అటల్‌ పెన్షన్‌ యోజన పథకాల కింద నమోదైన లబ్దిదారుల సంఖ్యే ఆ జిల్లా అభివృద్ధికి ప్రామాణికంగా పరిగణించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కడప జిల్లాల్లో బ్యాంక్‌ శాఖలను కుదించడం వాస్తవం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్‌ అందచేసిన వివరాల ప్రకారం 2017లో కడప జిల్లాలో వివిధ బ్యాంక్‌లకు చెందిన 378 శాఖలు ఉండగా 2019లో వాటి సంఖ్య 380కి పెరిగిందని చెప్పారు. అలాగే కడప జిల్లాలో 724 మంది బిజినెస్‌ కరస్పాడెంట్స్‌ ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్నారని కూడా ఆయన తెలిపారు.

ఎల్ఐసీ ఆర్థికంగా దృఢంగా ఉంది
భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఆర్థిక పరిస్థితిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కొట్టిపారేశారు. ఎల్‌ఐసీ ఆర్థికంగా దృఢంగా ఉందని మంగళవారం ఆయన రాజ్యసభలో ప్రకటించారు. ఎల్‌ఐసీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఎల్‌ఐసీకి సంబంధించి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న వదంతులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని  తెలిపారు. 

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్దేశించిన సాల్వెన్సీ మార్జిన్‌ (1.50) కంటే ఎల్‌ఐసీ సాల్వెన్సీ మార్జిన్‌ (1.60) అధికంగా ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. అలాగే పాలసీల సంఖ్య, మొదటి ఏట ప్రీమియం చెల్లింపుల్లో అత్యధిక మార్కెట్‌ షేర్‌ కూడా ఎల్‌ఐసీదేనని తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి దేశవ్యాప్తంగాఎల్‌ఐసీతో సహా 24 బీమా సంస్థలు విక్రయించిన మొత్తం పాలసీలలో 77.61 శాతం ఒక్క ఎల్‌ఐసీనే విక్రయించిందన్నారు. మొదటి ఏట పాలసీ చెల్లింపులలో 70.02 శాతం మార్కెట్‌ షేర్‌ ఎల్‌ఐసీదేనని చెప్పారు. ఎల్‌ఐసీ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి డివిడెంట్‌ చెల్లిస్తూ వస్తోందని పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,610.74 కోట్లు  ఎల్‌ఐసీ డివిడెండ్‌ కింద ప్రభుత్వానికి చెల్లించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు