ఏడాది పాలనలో సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారు..

30 May, 2020 11:13 IST|Sakshi

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

సాక్షి, విశాఖపట్నం: ఏడాది పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం తొలి ఏడాదిలోనే నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి అవంతి‌ పూల మాలలు వేసి నివాళర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిటీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, నార్త్ ఇన్ ఛార్జి కెకె రాజు, మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, కుంభా రవిబాబు, మహిళా  విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి, కొయ్యా ప్రసాద రెడ్డి, శ్రీధర్రెడ్డి, కోలా గురువులు పాల్గొన్నారు. (విశాఖపై అభివృద్ధి సంతకం)

వినూత్న పాలనతో చెరగని ముద్ర..
మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఏడాది కాలంలోనే వినూత్నమైన పాలనతో ప్రజల్లో సీఎం జగన్‌ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ‌ పథకాలు ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. సీఎం జగన్‌ చేస్తోన్న సుపరిపాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఓర్వలేకపోతున్నారని.. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎన్నికుట్రలు చేసినా సీఎం జగన్‌ సంకల్పాన్ని టీడీపీ అడ్డుకోలేదన్నారు. (ఏడాదిలో ఎన్నో సంచలన నిర్ణయాలు)

టీడీపీ నేతలకు సవాల్‌..
పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సీఎం జగన్‌ ‌నిధులు కూడా కేటాయించారని మంత్రి అవంతి తెలిపారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా మూడు రాజధానుల ప్రకటన చేశారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 80 శాతానికి పైగా సీట్లు, 50 శాతం ఓట్లు వైఎస్సార్ సీపీ సాధించిందని పేర్కొన్నారు. విశాఖ భూ కబ్జాపై టీడీపీ నేతల ఆరోపణలను అవంతి శ్రీనివాస్‌ ఖండించారు. ఏడాది పాలనలో భూకబ్జా జరిగిందని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని.. కష్టించి పనిచేసిన కార్యకర్తలకు త్వరలోనే పదవులు ఇస్తామని ఆయన తెలిపారు.

తనదైన మార్క్‌తో: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
ఏడాది పాలనలోనే తనదైన మార్క్‌తో సీఎం జగన్‌ సంక్షేమ పాలన అందించారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఎప్పటికీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు