పెట్టుబడులు ఎక్కడ చంద్రబాబు? : అవంతి

13 Aug, 2019 19:58 IST|Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విశాఖపట్నం : కోట్లు ఖర్చు చేసి పెట్టుబడుల సదస్సు నిర్వహించి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు, మరి ఆ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేక పోతున్నారని, పదవిలో ఉండగా కాంట్రాక్టర్ల గురించి తప్ప ఏనాడైనా ప్రజల గురించి మాట్లాడావా అని విమర్శించారు. ‘మీకు ఇప్పటికే ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇంకా మారకుండా స్థాయి దిగజారి మాట్లాడటం తగదని’ చంద్రబాబుకు సూచించారు.

మానిఫెస్టోలో పెట్టిన ప్రతి పనినీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ‘టీడీపీ నాయకులు ఇసుకను ఆదాయ వనరుగా భావించి దోచుకున్నారు. ఇప్పుడు దోపిడీ లేకుండా మా ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తోంది. ఈ ఆలస్యం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నా, మంచి కోసం కొంత సమయం అగాలని’ పేర్కొన్నారు. ‘అన్నా క్యాంటీన్లు పేదల కోసం ఏర్పాటు చెయ్యాలి. కానీ ఆ లక్ష్యం ఎక్కడా కనిపించలేదు. అదో పెద్ద స్కాం. ఒక్కో బిల్డింగ్ కోసం రూ.50 లక్షలు ఖర్చు చేశారు. త్వరలో ప్రజలకు అనువుగా దుబారా లేకుండా భోజనం అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీపడే పరిస్థితి లేదన్నారు. విశాఖ జిల్లాలో ఇసుక ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు